తుదిశ్వాస వరకు బీజేపీలోనే వుండాలనుకున్నా .. కానీ , కవిత అరెస్ట్ కాకపోవడంతో : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 25, 2023, 6:15 PM IST

మోడీ , అమిత్ షా అంటే తనకు గౌరవమని.. అందుకే తుదిశ్వాస వరకు బీజేపీలోనే వుండాలని అనుకున్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మద్యం కేసులో కవిత అరెస్ట్ కాకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిచ్చిందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా నా వంతు పాత్ర పోషించానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని.. అహంకారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచే కేసీఆర్‌పై నా పోరాటం ప్రారంభమైందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పే పార్టీ బీజేపీ మాత్రమేనని భావించానని ఆయన పేర్కొన్నారు. 

దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు చూసి బీజేపీపై అప్పుడు నమ్మకం కలిగిందని కోమటిరెడ్డి తెలిపారు. 100 మంది బీఆర్ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రజల్లో నమ్మకం సడలిందని.. మద్యం కేసులో కవిత అరెస్ట్ కాకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిచ్చిందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం అనుమానం కలుగుతోందని కోమటిరెడ్డి అన్నారు. 

Latest Videos

undefined

ALso Read: మొన్ననే బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని.. అంతలోనే మాట మార్చేస్తారా : రాజగోపాల్ రెడ్డిపై ఈటల ఆగ్రహం

మోడీ , అమిత్ షా అంటే తనకు గౌరవమని.. అందుకే తుదిశ్వాస వరకు బీజేపీలోనే వుండాలని అనుకున్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దుర్మార్గ కేసీఆర్‌ను గద్దె దించుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం బాధ అనిపించిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ద్వారానే కేసీఆర్‌ను గద్దె దించగలమని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. తన సహచరులు, అనుచరులు , పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్‌లో చేరుతున్నానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు కోరుకుంటున్న సామాజిక తెలంగాణ .. కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని .. అయితే దీనిని కాంగ్రెస్ నిజం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. డబ్బు కోసం, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని ఆయన తేల్చిచెప్పారు. రాజీనామా చేసినప్పుడు నా త్యాగం వృథా కాలేదని ఆయన అన్నారు. నా రాజీనామాతో మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తాను రాజీనామా చేశాకే.. మునుగోడు ప్రజల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయ్యిందని, గట్టుప్పల్ మండలం అయ్యిందని కోమటిరెడ్డి గుర్తుచేశారు. అలాగే చౌటుప్పల్‌కు 100 పడకల ఆసుపత్రి వచ్చిందని, గ్రామాల్లో రోడ్డు వేశారని ఆయన తెలిపారు. తాను మరోసారి మునుగోడు నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!