
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతం సృష్టించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
గురువారంతో పవన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడుస్తోంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ బాధ్యతలలో చూపిన చొరవ, ప్రజలందరికీ అందించిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించారు.
వీడియోలో పవన్ ప్రమాణ స్వీకారంతో మొదలవుతుంది. “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అంటూ ఆయన ప్రతిజ్ఞ చేసిన క్షణాన్ని గుర్తు చేస్తూ, ఏడాది వ్యవధిలో ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎలా తోడైందో విశ్లేషించారు. ఈ ఒక ఏడాది కాలంలో ప్రజలలో ఆయనపై నమ్మకాన్ని మరింత బలపరిచిన విధానాన్ని వీడియోలో చూపించారు.
వీడియోలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన ముఖ్యమైన పనులను చూపించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే చర్యలు, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కుంకీ ఏనుగులను తీసుకురావడం, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చాయని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఎలా ఒక సాధారణ నాయకుడి స్థాయి నుంచి “గేమ్ ఛేంజర్”గా ఎదిగారన్న దానిని ఈ వీడియోలో చూపించారు. పిఠాపురం ఎన్నికల్లో సాధించిన ఘన విజయం, పార్టీకి 100% స్ట్రైక్ రేట్ రావడం, రాష్ట్ర రాజకీయ దిశను మార్చిన అతని ప్రభావం ఈ వీడియోలో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అభిమానులు వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.