
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మండిపడ్డారు సీనియర్ నేత జానారెడ్డి. ఇది ఎవరు చేసినా తప్పేనని.. చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలే ఇలాంటి వారికి బుద్ధి చెబుతారని జానారెడ్డి అన్నారు.
ఇకపోతే... ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారం నాడు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ ఆదేశించింది. అస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో వెలుగు చూసింది. పార్టీని చూడవద్దని ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఆ వెంటనే మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించదని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ALso Read:కోమటిరెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు: 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
మరోవైపు... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. కోమటిరెడ్డిని వెంకట్ రెడ్డి తాను సొంత అన్నగా భావించానని చెప్పారు. ప్రచారానికి రావాలని వేడుకున్నట్టుగా తెలిపారు. ఆడబిడ్డగా మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నాని చెప్పారు. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తన తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో స్రవంతి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తానని చెప్పారని అన్నారు.