మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కాన్వాయిపై ఆదివారం నాడు దాడి జరిగింది. బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తలమధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆదివారంనాడు కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై కాన్వాయిపై దాడి జరిగింది. బీజేపీకి చెందిన వారే తమ కాన్వాయిలోని వాహనంపై దాడి చేశారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. తమ కాన్వాయిలోని వాహనం ప్రచారానికి వెళ్లే సమయంలో దారి ఇవ్వకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు బీజేపీ పై ఆరోపణలు చేసింది.
నాంపల్లికి సమీపంలో తమ కార్యకర్తలు తమ వాహనానికి అడ్డుపడుతున్న బీజేపీ వాహనాన్ని నిలిపివేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించిన సమయంలో అసభ్యంగా తమవారిని దూషించడమే కాకుండా తమ వారిపై దాడి చేశారన్నారు. తమ వాహనంలో మహిళ కార్యకర్త, వీడియో గ్రాఫర్, డ్రైవర్ లు ఉన్నారని స్రవంతి చెప్పారు.తమ వారిపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనన్నారు. దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు స్థానికులు కాదని స్రవంతి ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడికి సంబంధించిన విషయమై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసినట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. దాడి సమయంలో తీసిన దృశ్యాలను కూడ ఎస్పీకి పంపామన్నారు.తమతో ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు.
తమ కాన్వాయ్ పై దాడికి దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. తమ వారిపై దాడి చేసిన వారంతా తమ ముందే వాహనాల్లో తిరుగుతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.పోలీసుల తీరును ఆమె తప్పుబట్టారు.
పాల్వాయి స్రవంతి ధర్నా
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అదే నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగాయి. ఆరు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఐదు దఫాలు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధుల్లో ఎక్కువ దఫాలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ స్థానంనుండి గెలుపొందారు.
also read:కోమటిరెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు: 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
గతంలో ఈ స్థానం నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేసినా ఆమె విజయం సాధించలేదు. 2014 ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది.ఆ సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.