టైర్ పంక్చర్ అయిందట...

First Published Feb 2, 2017, 11:28 AM IST
Highlights
  • బడ్జెట్ పై మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విసుర్లు

 

కొత్త తరహాలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ కేంద్ర మంత్ర జైపాల్ రెడ్డి తన దైన స్టైల్ లో స్పందించారు. బడ్జెట్ సమయంలో సాధారణంగా ఎవరైనా  ఆర్థికమంత్రి పైనే విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే జైపాల్ రెడ్డి మాత్రం ఆయన జోలికి పోకుండా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారు.

 

నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు గాలితో నిండిన టైర్లా ఉన్న ప్రధాన మంత్రి మోదీ, బడ్జెట్ తర్వాత పంక్చర్‌ అయిన టైర్ లా తయారైందని ఎద్దేవా చేశారు.


నోట్లరద్దు వల్ల ఆరు నెలల పాటు కష్టాలు, 3 నెలలు నష్టాలు వచ్చాయని ఎద్దెవా చేశారు. ప్రధాన మంత్రి ఆకస్మాత్తుగా తీసుకున్న నోట్ల రద్దు ప్రకటనను ఆలోచన లేని తొందరపాటు చర్యగా అభివర్ణించారు.

 

నోట్లరద్దు తర్వాత బడ్జెట్ పై ఆసక్తి గా చూసిన సామాన్యుడికి ఈ బడ్జెట్ పూర్తి నిరాశను నింపిందని ధ్వజమెత్తారు. తన 70 ఏళ్ల జీవితంలో ఏనాడు ఇంతటి నిరాశాపూరిత బడ్జెట్ చూడలేదని పెదవి విరిచారు.

 

అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గడం వల్ల కేంద్రానికి ఏటా రూ. లక్షకోట్లు ఆదా అయ్యాయని అయినా కూడా బడ్జెట్ లో మాత్రం ప్రజలకు ఊరట కలిగించే ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు.

 

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అంశంపై కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు.  రూ. 20 వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ. 2 వేలకి కూడా బినామీలను వెతుక్కుంటాయని స్పష్టం చేశారు.

 

click me!