
గ్యాంగ్‌స్టర్ నయీం... పొలిటికల్ నేతలు, పోలీసులు బాసులు పెంచి పోషించిన గంజాయి వనం. సెటిల్ మెంట్ల నుంచి కబ్జాల వరకు ప్రతి పనిలో ముగ్గురు భాగస్వాములే అన్నది అందరికి తెలిసిన నిజం.
అనూహ్య పరిస్థితుల్లో నయీం ఎన్ కౌంటర్ అవడంతో అతడితో అంటకాగిన నేతల వ్యవహారం ఒక్కోటి బయటకి వస్తోంది. అయితే ఇందులో అన్ని పార్టీల నేతలు, పోలీసు బాసులు ఉండటంతో అసలు తలకాయలు బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
మొదటి నుంచి నయీం ఎన్ కౌంటర్ విచారణ రోజుకో మలుపులు తిరుగుతోంది. గ్యాంగ్ స్టర్ డైరీ బయటపడితే అందరి భాగోతాలు బయటపడుతాయి. అందుకే ఇప్పటికీ ఆ డైరీ బయటపడటంలేదు. పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐ కి అప్పగించకుండా సిట్ వేసి చేతులు దులిపేసింది.
ఇటీవల నయీం కేసు విచారణ ముగించిన సిట్ తన వివరాలను ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్రమంతా నయింకు రాజకీయనాయకులు, పోలీసులు అధికారులతో ఉన్న అనుబంధాన్ని విడమరిచి మరీ చెబుతుంటే ప్రభుత్వం మాత్రం పోలీసులకు నయీంతో సంబంధం లేదని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసింది. మరోవైపు పోలీసులు కూడా తమకు చేసిన న్యాయానికి ప్రతిఫలంగా రాజకీయ నాయకులకు నయీంతో సంబంధాలు లేవని సర్టిఫికేట్ ఇచ్చేశారు.
దీంతో కథ ముగిసింది అనుకున్న తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వెలుగు చూశాయి. నయీంతో పోలీసులు ఉన్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సీడీఐ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు, వాళ్లిద్దరూ ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయట పడింది. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ ఫొటోల ద్వారా స్పష్టం అవుతోంది.
ఎన్‌కౌంటర్ జరగడానికి కొంత కాలం ముందు నయీం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తూ, పోలీసుల సమాచారాన్ని నయీంకు అందజేస్తూ అతడికి రక్షణగా ఉండేవారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం అవుతోంది.
ఈ ఫొటోలు చూసైనా నయీంతో ఖాకీలకు అనుబంధం ఉందని పోలీసు బాసులు ఒప్పుకుంటారా లేక కొత్త కథలు వినిపిస్తారా చూడాలి.