జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే వేధింపులే కారణమని కన్నీటిపర్యంతం..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2023, 4:09 PM IST
Highlights

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటన చేశారు.

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేక రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. పలుమార్లు కన్నీటిపర్యంతరమయ్యారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని కూడా విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. తనకు పదవి దక్కేందుకు కారణమైన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మంత్రి కేటీఆర్‌లకు శ్రావణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  

పెద్దల ఆశీస్సులతో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కిందని.. కానీ మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నానని చెప్పారు. తాను పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్ అని పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని అన్నారు. పలు సందర్భాల్లో నలుగురు తిట్టినా  కూడా భరించానని చెప్పుకొచ్చారు. పార్టీ కోసమే తాను ఇన్నాళ్లు కట్టుబడి పని చేశామని చెప్పారు. అయితే కుటుంబంపై బెదిరింపులకు దిగడంతోనే తాను మీడియా ముందు వచ్చానని చెప్పారు. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. 

‘‘దొర మీకో దండం.. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చిన చైర్‌పర్సన్ పదవికి ఈ చీకటి రోజున రాజీనామా చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ దొర మీకు దండం. మీ గడి నుంచి నేను ఈరోజు బయటపడుతున్నాను. మీరే గెలిచారు. బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు’’ అని శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తన కుటుంబానికి ఏం జరిగినా ఎమ్మెల్యే సంజయ్‌దే బాధ్యత అని అన్నారు. 

ఇక, జగిత్యాల బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా ముసలం నెలకొంది. మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన  కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. కొద్దిరోజులుగా శ్రావణికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కొందరు కౌన్సిలర్లు.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రావణి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న వారు.. ఆమెను గద్దె దింపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం 48 వార్డులు ఉన్న జగిత్యాల మున్సిపాలిటీలో.. 38 మంది అధికార బీఆర్ఎస్‌కు చెందినవారే. వీరిలో 27 మంది మున్సిపల్ చైర్‌పర్సన్‌ శ్రావణిపై తిరుగుబాటు చేస్తున్నారు. వీరి వెనక వైఎస్ చైర్‌పర్సన్ హస్తం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే వీరికి సంజయ్ కుమార్ మద్దతు ఉందని శ్రావణి వర్గం చెబుతుంది. 

click me!