
హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. దారి వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఓ వ్యక్తి ఇతరులు వెళ్లే దారిని ఆక్రమించుకుని దానిపై కర్రలు నాటాడు. వాటిని తొలగించడానికి ఈ రోజు ఎస్సై, తహశీల్దార్, ఎంపీవోలు అక్కడికి వెళ్లారు. ఇది తెలుసుకుని గంగాధర్ ఏకంగా పెట్రోల్‌ను వెంట తెచ్చుకున్నాడు. ఆ పెట్రోల్‌ను అధికారులపైకి పిచికారి చేశాడు. ఎస్సై ఆ గంగాధర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో ఎంపీవో ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అక్కడ చాలా మందిపై పెట్రలో పడింది. అప్పుడు గంగాధర్ లైటర్ వెలిగించాడు. దీంతో సమీపంలోనే ఉన్న ఎంపీవో అధికారికి నిప్పు అంటుకుంది. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు.
బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నాడని స్థానికులు కొందరు ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక కార్యదర్శి, ఇతరులు ఆక్రమించుకున్న గంగాధర్‌తో మాట్లాడారు. కానీ, ఆయన వినలేదు. ఈ విషయమై మాట్లాడటానికి వచ్చిన పంచాయతీకి చెందిన సిబ్బందినీ దూషించారు. ఈ దారి వివాదమై పోలీసు స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.
కానీ, గంగాధర్ మాత్రం ఆ దారి గుండా ఎవరిని వెళ్లనివ్వకుండా కర్రలు నాటాడు. దీంతో స్థానికులు మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సారి రెవెన్యూ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని స్పాట్‌కు వెళ్లారు. ఆ కర్రలు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే.. అక్కడకు గంగాధర్ పెట్రోల్ తెచ్చి వారిపై పోసి నిప్పంటించాడు.
దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగ్రహించాడు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.