
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో ముఖ్యమంత్రిని కలిసినా పరేషాన్ అవుతోందని అన్నారు. సీఎంను కలిసిన మరుక్షణం నుంచే కొత్త పంచాయితీ మొదలవుతుందని చెప్పారు. సీఎంను కలిస్తే వారి పార్టీలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా సమస్య పరిష్కారం కావాలంటే సీఎంను కలవాల్సిందేనని అన్నారు. సీఎంను తిట్టినంతమాత్రాన సమస్య పరిష్కారం కాదని జగ్గారెడ్డి కామెంట్ చేశారు.
ఇక, కొన్ని వారాల కింద అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో కేసీఆర్‌ను కలిసిన జగ్గారెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను దొంగచాటుగా సీఎంను కలవలేదని అన్నారు. సీఎం కేసీఆర్ తాను అసెంబ్లీ హాల్‌లో కలిశానని.. ఆ తర్వాత ఆయన చాంబర్‌కు వచ్చి కలవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి కలిశానని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో తన నియోజకవర్గ అభివృద్ది పనుల గురించి చర్చించానని తెలిపారు.
ప్రధానమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు కలుస్తారని.. అలాగే తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. నియోజకవర్గ అభివృద్దిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని సీఎంను కోరారని.. టైమ్ ఇస్తే ప్రగతి భవన్‌కు వచ్చి కలుస్తానని చెప్పినట్టుగా తెలిపారు.