
హైదరాబాద్ :జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్ ఒకరు ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఆ కమెడియన్ ఎవరో కాదు జానపద గాత్రంతో సింగర్ గా పాపులర్ అయిన నవ సందీప్.ఇటీవల నవ సందీప్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నవ సందీప్ మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో నవసందీప్ పై పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
తాజాగా నవ సందీప్ ని నేడు పోలీసులు మధురానగర్ లో అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడని నవ సందీప్ పై ఆరోపణలు వచ్చాయి. పెళ్లి పేరుతో నమ్మించడంతో మోసపోయినట్లు చెబుతోంది. అతడి మాటలు నమ్మానని, కానీ ఇప్పుడు మోసం చేశాక ముఖం చాటేస్తున్నాడు అని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడుగుతుంటే తప్పించుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతిని నవసందీప్ 2018 నుంచే మోసం చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ తో ఆ యువతని ప్రేమలోకి దించాడు. ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేలా చేశాడు. సదరు యువతి షేక్ పేటలోని హాస్టల్ లో ఉంటోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తెస్తే.. నాకు మరో సంబంధం కుదిరింది అని ముఖం చాటేసినట్లు పోలీసులు తెలిపారు. దీనితో ఆ యువతి తాను మోసపోయినట్లు గ్రహించింది.
నవ సందీప్ కమెడియన్ గా, సింగర్ గా జబర్దస్త్ షోలో పాల్గొంటున్నాడు. అలాగే అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో తన జానపద పాటలతో ప్రేక్షకులని అలరించాడు. ఎంతో ట్యాలెంట్ ఉన్న నవ సందీప్ బుద్దిగా కనిపిస్తూ ఇలా యువతిని మోసం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ లో ఎమోషనల్ ప్రేమ గీతాలతో కూడా నవ సందీప్ పాపులర్ అయ్యాడు.
నవ సందీప్ ఇప్పుడు అరెస్ట్ కావడం అతడి కెరీర్ పై ఎంతో ప్రభావం చూపుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఆ యువతి చేసిన ఆరోపణలు బలంగా ఉంటే ఈ కేసులో నవ సందీప్ పీకల్లోతులో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు. జానపద గీతాలు, ప్రేమ పాటలు హుషారెత్తించేలా పాడడంలో నవ సందీప్ యూట్యూబ్ లో ఎంతో గుర్తింపు పొందారు.