
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల గత రెండున్నరేళ్ల కాలంలో లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కె టి రామారావు వెల్లడించారు. మరొక మూడున్నర లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించిందని కూడ ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాపితంగా 44,791 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇందులో రంగారెడ్డి, సంగారెడ్డి మేడ్చెల్ జిల్లాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు రు. 7169 కోట్ల పెట్టబడుల వచ్చాయని,వీటి వల్ల 68622 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించినందని ఈమధ్యహ్నం ఆయన వెల్లడించారు. రెండోస్థానంలో ఉన్న సంగారెడ్డికి రు.4781 కోట్ల పెట్టుబడులు వచ్చి, 19004 మందికి ఉపాధి లభించిందని, ఇక మెడ్చల్ కు సంబంధించి రు.2589కోట్ల పెట్టుబడి, 18997 ఉద్యోగాలు వచ్చాయని రామారావుచెప్పారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందని చెబుతూ పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ముందుకు పోతుందనిచెప్పారు.. దీనికి కారణం పరిశ్రమలనుఏర్పాటు చేయాలనుకునే వారికి చట్టాలు అడ్డం కాకుండా ఉండేందుకు వాటిని సరళతరం చేయడమేనని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం 26 చట్టాలను సవరించిందని అన్నారు. సులభతర వ్యాపారం విషయంలో ఆంధ్రతో కలసి అగ్రస్థానాన్నిపంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్రం మొత్తంగా 380 అంశాలపై కేంద్రం సర్వే చేస్తే 324 అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని సాధించడానికి అన్ని శాఖలు కృషి చేశాయని తెలిపారు. ప్రభుత్వం లోని 22 శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అభినందించారు.