KCR: ప్రజలను ముఖ్యంగా ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అలాగే, బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు.
Telangana Assembly Elections 2023: లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందనీ, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జోస్యం చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీపై కూడా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన 'మొహబ్బత్ కీ దుకాన్' వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. లౌకికవాది అయితే అది తన పనిలో ప్రతిబింబించాలని కేసీఆర్ అన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని కేసీఆర్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఎవరి కనుసన్నల్లో జరిగిందంటూ ప్రశ్నించారు. 'మేము (బీఆర్ఎస్) జాతి, మతంతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూస్తాం. కాంగ్రెస్ మిమ్మల్ని (ముస్లింలను) కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంది. ఇప్పటికీ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. ద్వేషంతో కూడిన 'దుకాన్' (దుకాణం) మూసివేస్తామని చెబుతున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం ఎవరి కనుసన్నల్లోనే జరిగిందని నేను అడుగుతున్నాను. ఎవరు చేశారు? దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. "తియ్యని మాటలు వినేలా చేస్తారు... మీరు లౌకికవాదులైతే, మీరు జీవితాంతం లౌకికవాదిగా ఉండాలి. కేసీఆర్ జీవించి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ గా ఉంటుందని" కూడా పేర్కొన్నారు.
undefined
మైనార్టీ సంక్షేమానికి రూ.12 వేల కోట్లు..
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 2014 నుంచి బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి మతకలహాలు జరగలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అల్లర్లు, కర్ఫ్యూలు నిత్యకృత్యంగా ఉండేవన్నారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ గా ఉంటుందన్నారు. "ఎవరూ విడిపోలేరు. అందరం కలిసి పనిచేస్తాం. ముస్లింలు హిందువుల కోసం, హిందువులు ముస్లింల కోసం పనిచేస్తారు. ఇద్దరు అన్నదమ్ముల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు" అని పేర్కొన్నారు. మతం, కులం ప్రాతిపదికన వివక్ష లేకుండా అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది
మతతత్వ మనస్తత్వంతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని కేసీఆర్ ఆరోపించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) ఏనాడూ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశాయని మండిపడ్డారు. సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ అనీ, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.