శ్రీ ఆదిత్య హోమ్స్‌పై ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం..!

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 11:47 AM IST
Highlights

హైదరాబాద్‌లోని శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. 

హైదరాబాద్‌లోని శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐదు రోజుల పాటు ఐటీ అధికారులు శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సోదాలు నిర్వహించారు. సోదాల సందర్భంగా కంపెనీ డైరెక్టర్లను బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంలో విచారించారు. స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. వారి బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించారు. అలాగే కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే ఖాతాల్లో అవకతవకలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్లాట్ కొనుగోలుదారుల నుంచి బ్లాక్‌లో నగదు తీసుకున్న ఆరోపణలపై కూడా ఐటీ అధికారులు వివరాలు సేకరించినట్టుగా సమాచారం. ఇక, సోదాలు ముగించిన ఐటీ అధికారులు.. విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్లుకు చెప్పినట్టుగా సమాచారం.

అయితే ఐటీ సోదాల సందర్భంగా.. కొందరు అధికారులు తమ కంపెనీ ప్రతినిధులను వేధించారని శ్రీ ఆదిత్య హోమ్స్ కంపెనీ నుంచి ఆరోపణలు వినిపించాయి. అయితే ఆ ఆరోపణలను ఐటీ అధికారులకు చెందిన వర్గాలు ఖండించాయి. 
 

click me!