సీఎం అభ్యర్థిగా రేవంత్ ఖరారైనట్టేనా? సోమవారం ఉదయం 9.30కి సీఎల్పీలో ఏం తేలనుంది?

By SumaBala Bukka  |  First Published Dec 4, 2023, 8:44 AM IST

ఉత్కంఠకు తెరపడనుంది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరో కాసేపట్లో తేలిపోనుంది. 


హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాల్లో చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆదివారం నాడు ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించింది.  తెలంగాణలో అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నారు.  కానీ ఫలితాలు వెలువడిన తర్వాత.. ఇది మారిపోయింది. సోమవారం నాడే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం జరగాల్సిన సీఎల్పీ సమావేశం… సోమవారం ఉదయం 9:30కు వాయిదా పడింది. 

ఈ సమావేశంలో సీఎల్పీ నేతను, ముఖ్యమంత్రిని ఎన్నుకొనున్నారు.  ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, సోనియా గాంధీలు హైదరాబాదుకు రానున్నారు.  ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్లు ఇక్కడే ఉన్నారు. ఈ సీఎల్పీ సమావేశంలో వాదనలు, ప్రతివాదనులకు అవకాశం లేకుండా ఏకవాక్య తీర్మానంతో నేతను ఎన్నుకొనున్నట్టుగా సమాచారం. 

Latest Videos

Telangana Elections 2023 : హేమాహేమీల ఓటమి... బిజెపి పరాభవానికి కారణాలివే...

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని  ప్రకటిస్తామని తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సీఎల్పీ సమావేశానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్,  బోసు రాజు, అజయ్ కుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత.. సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి.. వారి ఆమోదంతో గవర్నర్ కు అందజేస్తారు.

ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీని మీద ఎలాంటి నిర్ణయం ఇంకా పూర్తిగా తీసుకోలేదని ఆదివారం రాత్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. 
 

click me!