ఓంప్రకాశ్ చౌతాలా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు.. కేసీఆర్ ఆసక్తి చూపడం లేదా..?

By Sumanth KanukulaFirst Published Sep 20, 2022, 10:52 AM IST
Highlights

మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా హర్యానాలో  ‘సమ్మాన్ సమరోహ్’ర్యాలీ నిర్వహిస్తున్నారు. దేవీలాల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. బీజేపీయేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు.

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ప్రత్యామ్నాయ వేదిక కోసం గత కొంతకాలంగా ప్రయత్నలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ నెల 25న హర్యానా పర్యటనకు వెళ్లడంపై డైలామాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా హర్యానాలో  ‘సమ్మాన్ సమరోహ్’ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని దేవీలాల్ కుమారుడు,  ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా నిర్వహిస్తున్నారు. 

ఈ ర్యాలీకి సంబంధించి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సిఎం నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, అకాలీదళ్‌కు చెందిన ప్రకాష్ సింగ్ బాదల్‌, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్.. సహా సీనియర్ ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో చాలా మంది ఆ ర్యాలీకి హాజరుకానున్నట్టుగా సమాచారం. అయితే ఈ ర్యాలీకి హాజరుకావడంపై లాభ నష్టాలను బేరీజు వేసుకుని కేసీఆర్ డైలామాలో పడినట్టుగా తెలుస్తోంది. 

దేవీలాల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. బీజేపీయేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి కేసీఆర్‌కు ఆహ్వానం పంపినట్టుగా ఐఎన్‌ఎల్‌డీ ప్రకటించింది. అయితే టీఆర్ఎస్ నుంచి మాత్రం ఇందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు. అయితే కేసీఆర్‌కు ఆహ్వానం అందిందని.. అయితే ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

అయితే ఈ భేటీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్లతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. బీజేపీయేతర వేదిక ప్రయత్నాల్లో భాగంగా శరద్‌ పవార్‌, నితీష్‌ కుమార్‌, దేవెగౌడ తదితర నేతలను కేసీఆర్‌ గత రెండేళ్లలో పలు సందర్భాల్లో కలిశారని.. మరోసారి వారిని కలవాల్సిన అవసరం లేదని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా  వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నేతలను కలిసే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం. అయితే దేవీలాల్ జయంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నందున.. ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరడంపై టీఆర్ఎస్ కట్టుబడి లేదని టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు తెలిపినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. 

click me!