వ్యాపారుల్ని దొంగలుగా మార్చిన లాక్‌డౌన్.. హైదరాబాద్‌లో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్

By Siva KodatiFirst Published Jun 5, 2021, 9:39 PM IST
Highlights

హైదరాబాద్‌లో ఇదే జరిగింది. వస్త్ర వ్యాపారం చేయుడానికి ఇరాన్‌ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి దొంగలుగా మారారు. డాలర్లను రూపాయలుగా మార్చుకునే క్రమంలో అవతలి వ్యక్తుల దృష్టి మరల్చి ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది

లాక్‌డౌన్ వల్ల దేశంలో సామాజిక పరిస్ధితులు విషమిస్తున్నాయి. ఉపాధి లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భార్యాబిడ్డలను పోషించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం దొంగతనాల బాట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇదే జరిగింది. వస్త్ర వ్యాపారం చేయుడానికి ఇరాన్‌ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి దొంగలుగా మారారు. డాలర్లను రూపాయలుగా మార్చుకునే క్రమంలో అవతలి వ్యక్తుల దృష్టి మరల్చి ఈ ముఠా చోరీలకు పాల్పడుతోంది. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎల్పీనగర్‌ పోలీసులు ముగ్గురు సభ్యుల ఇరాన్‌ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 35వేల నగదు, 811 అమెరికా డాలర్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.  

వివరాల్లోకి వెళితే.. హుస్సేన్‌, రజబ్‌, నసీర్‌ అనే ముగ్గురు ఇరాన్ జాతీయులు కొన్ని నెలల క్రితం ఢిల్లీకి వచ్చారు. మన దేశానికి సంబంధించిన వస్త్రాలకు టెహ్రాన్‌లో డిమాండ్‌ ఉండటంతో వస్త్రాలను ఎగుమతి చేశారు. ఢిల్లీలో కొంతకాలంగా లాక్‌డౌన్‌ ఉండటం.. వ్యాపారంలో నష్టాలు రావడంతో హైదరాబాద్‌‌కు మకాం మార్చారు. నగరంలోని టోలిచౌక్‌లో గది అద్దెకు తీసుకుని దొంగలుగా మారారు.

Also Read:తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 2,070 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లోనూ తగ్గుదల

డాలర్లను తీసుకుని రూపాయలు ఇవ్వాలంటూ మాటల్లో దించి ఎదుటి వ్యక్తులు ఇచ్చే డబ్బులను లెక్కించే సమయంలో వాళ్లకు తెలియకుండా నగదు నొక్కేస్తున్నారు. ముఖ్యంగా దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారుల దృష్టి మరల్చి డబ్బు దోచేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై నార్సింగి, రాజేంద్రనగర్‌, కార్ఖానా, ఎల్బీనగర్‌ పీఎస్‌ల పరిధిలో కేసులు నమోదైనట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మీడియాకు తెలిపారు. 

click me!