హైదరాబాద్‌లో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర గంజాయి ముఠా.. డీసీఎంలో తరలిస్తున్న 160 కిలోల గంజాయి స్వాధీనం

By Mahesh KFirst Published Mar 16, 2023, 7:36 PM IST
Highlights

ఏపీ నుంచి ముంబయికి గంజాయిని తరలించే అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎంలోని ఇద్దరు నిందితులు ఏ2, ఏ3లను అరెస్టు చేశారు. 
 

హైదరాబాద్: హయత్ నగర్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు డీసీఎం కంటైనర్‌లో తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

కేసు వివరాలు:
ఈ డ్రగ్స్ ముఠా కేసులో ఏ1 లాల్ బి గులాం షేక్ మహారాష్ట్ర వాసి. అక్కడ ఓ లాజిస్టిక్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. అతడు ఏపీలోని ఏ4 ప్రసాద్ నుంచి కిలోకు రూ. 2 వేల చొప్పున గంజాయిని చీప్‌గా కొనుగోలు చేస్తాడు. ఏ5, ఏ6లైన అన్వర్ పాషా, రాణిల ద్వారా ఈ కొనుగోలు వ్యవహారం జరుగుతుంది. దీన్ని రాజమండ్రీ, ఖమ్మం, సూర్యపేట్, హైదరాబాద్‌ల గుండా ముంబయికి తరలిస్తాడు. అక్కడ తన కస్టమర్లకు ఏ1 గంజాయిని అమ్ముతాడు.

ఈ తరలింపునకు లాల్ బి గులాం షేక్ ఇద్దరు డీసీఎం డ్రైవర్లను ఏ2 భరత్ బాపు రామ్ పాంచన్, ఏ3 ఆకాశ్ అనురాథ్ కాంబ్లేను ఎంచుకున్నాడు. ఒక్క ట్రిప్‌కు రూ. 1 లక్ష డీల్ చేసుకున్నాడు. ఇటీవల మంచి వ్యాపారం జరుగుతుండటంతో ట్రిప్‌కు ప్రాఫిట్‌లో 10 శాతం అంటే రూ. 2 లక్షలు అందిస్తున్నాడు.

ఎప్పటిలాగే.. ఏ1 సూచనలతో ఈ నెల 14వ తేదీన ముంబయి నుంచి మెడిసిన్ లోడ్‌ను ఏ2, ఏ3లు విజయవాడకు తెచ్చారు. ఏ4, ఏ5, ఏ6లు గంజాయిని అనకాపల్లి వరకు కారులో తెచ్చారు. 15.03.2023 రాత్రి కారులో నుంచి 160 కిలోల గంజాయి (80 ప్యాకెట్లు)ని అన్‌లోడ్ చేసి డీసీఎంలో లోడ్ చేసుకున్నారు. రాజమండ్రీ, ఖమ్మం, సూర్యపేట్ గుండా ముంబయికి బయల్దేరారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పెద్దఅంబర పేట్ వచ్చాక 16.03.2023 తెల్లవారుజామున వీరు పోలీసులకు చిక్కారు.

ముందస్తు సమాచారంతో పోలీసులు ఇక్కడ వెహికిల్ చెకింగ్ చేపట్టారు. డీసీఎంలోని ఏ2, ఏ3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసులు ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు.

click me!