Inter students suicides: తల్లిదండ్రులకు కడుపుకోత, బోర్డుపై భగ్గు

By Pratap Reddy KasulaFirst Published Dec 23, 2021, 11:25 AM IST
Highlights

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కడుపుకోతకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో బోర్డు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేస్తన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరుకుంది. తాజాగా గాంధీలో ఓ విద్యార్థిని మరణించింది. ఈ నెల 17వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని బుధవారంనాడు మరణించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో బి నందిని అనే 17 ఏళ్ల విద్యార్థిని హెయిర్ డై సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది.ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే ఆవేదనతో నల్లగొండ జిల్లాకు చెందిన జాహ్నవి, నిజామాబాద్ జిల్లాకు చెందన ధనుష్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

అనూహ్యంగా ఇంటర్మీడియట్ లో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. 51 శాతం మంది ఫెయిలయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలను కోత పెడుతున్నాయి. వారు కన్నీరుమున్నీరవుతున్నారు. గణేష్ రూపానీ అనే విద్యార్థి తాను ఆత్మహత్య చేసుకోబుతున్నట్లు మంత్రి కేటీఆర్ కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్వీట్ చేశారు. 

Also Read: గ్లోబరీనాపై చర్యలు ఏవి... కేసీఆర్ పై విజయశాంతి కామెంట్స్

కరోనా వైరస్ కారణంగా సరిగా క్లాసులు జరగలేదు. ప్రాక్టికల్ క్లాసులు కూడా సరిగా జరగలేదు. పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసినట్లుగానే తమను కూడా ప్రమోట్ చేస్తారని విద్యార్థినీవిద్యార్థులు భావించారు. చివరి నిమిషంలో పరీక్షలు రాయాల్సిందేనని చెప్పారు. దీంతో విద్యార్థులకు పరీక్షలకు తయారు కావడంలో కూడా విఫలమయ్యారు. గ్రామీణ విద్యార్థులకు తగిన సాంకేతిక సహకారం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆన్ లైన క్లాసులకు వారు సరిగా హాజరు కాలేకపోయారు. దాన్ని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి.

ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కనీస మార్కులు వేసి విద్యార్థులను పాస్ చేయాలని, రీవాల్యువేషన్ కు అవకాశం కల్పించాలని ఎన్ఎస్ యూఐ డిమాండ్ చేసింది. ఎఐఎస్ఎఫ్ విద్యార్థులు హైదరాబాదులోని బషీర్ బాగ్ లో గల మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు.

Also Read: తెలంగాణ ఇంటర్ ఫలితాలు... గ్లోబరీనా ఔట్

విద్యార్థుల ఆత్మహత్యలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. 

గతంలోనూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకానికి 27 మంది విద్యార్థులు బలయ్యారు. గ్లోబరినా అనే స్ంస్థ నిర్వాకం వల్ల విద్యార్థుల మరణాలు సంభవించాయనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంపై సర్వదా విమర్శలు తలెత్తుతున్నాయి.  

click me!