నన్ను ప్రేమిస్తావా? ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటావా?.. ఇంటర్ విద్యార్థినికి వేధింపులు.. చివరికి..

By SumaBala BukkaFirst Published Dec 28, 2022, 7:17 AM IST
Highlights

ప్రేమించమని యువకుడు వేధింపులకు గురిచేస్తుండడంతో ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమించాలని అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తూ.. నిరాకరిస్తే దాడులకు దిగుతున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వెలుగు చూసింది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. తన ప్రేమను నిరాకరిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఎస్ఐ చంద్రమౌళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన త్రిష (18) అక్కడి గంగాధరలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుకుంటోంది. అదే కాలేజీలో చదువుకుంటున్న సతీష్ కూడా గంగాధరకు చెందినవాడే. ఒకే ఊరికి చెందిన వారు.. ఎవరైనా వేధిస్తే సాయంగా ఉండాల్సింది పోయి.. అతనే వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను తరచుగా ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేక త్రిష విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు.. సతీష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. త్రిషను వేధించకుండా కొడుకును కట్టడి చేయాలని తెలిపారు.

బంగారం కోసం బాలానగర్‌లో దారుణం: మహిళను చంపి, ముక్కలుగా కట్ చేసి.. ఆపై కాల్చేసి

అయినా కూడా సతీష్ వేధింపులు తగ్గలేదు. సోమవారం ఇంట్లో త్రిష ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చాడు. మళ్లీ వేధించడం ప్రారంభించాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేకపోతే ఆత్మ హత్య చేసుకుంటావా? అని వేధించాడు. తనతో పాటు తీసుకువచ్చిన పురుగుల మందులు ఆమెకు ఇచ్చాడు. ఎంత చెప్పినా అతని  వేధింపులు తగ్గకపోవడంతో ఆమె భరించలేక అతడిచ్చిన పురుగుల మందును తాగేసింది. ఇంతలో త్రిష అక్క అక్కడికి వచ్చింది. అది చూసిన సతీష్ అక్కడి నుంచి పారిపోయాడు. 

అప్పటికే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని తన  అక్కకు చెప్పింది. దీంతో ఆమె వెంటనే 108కు ఫోన్ చేసింది. అయితే 108 అంబులెన్సు వచ్చేసరికే.. పురుగుల మందు పనిచేయడంతో త్రిష మృతి చెందింది. త్రిష తల్లి స్వప్న కూతురి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నిందితుడు సతీష్, అతని తల్లిదండ్రులు పద్మ లింగయ్యల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!