ఘనంగా ముగిసిన బ్రాహ్మణ్ అఫిషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ వార్షికోత్సవ సభ

By Siva KodatiFirst Published Dec 27, 2022, 9:44 PM IST
Highlights

హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం బ్రాహ్మణ్ అఫిషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆబోపా )సప్తమ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి  మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు సోదరుడు,  సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు పి.వి.మనోహార్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

బ్రాహ్మణులు కేవలం అర్చకత్వం, పౌరోహిత్య వృత్తులకే పరిమితం కాకుండా  అన్ని రంగాలలోకి ప్రవేశించడం గర్వకారణం అన్నారు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు సోదరుడు,  సర్వార్థ సంక్షేమ సమితి అధ్యక్షుడు పి.వి.మనోహార్ రావు . హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన బ్రాహ్మణ్ అఫిషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆబోపా )సప్తమ వార్షికోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని  మనోహర్ రావు ఆకాంక్షించారు. అలాగే బ్రాహ్మణ  సంఘాలు అఖిల భారత స్థాయిలో విజయవంతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. నిష్ట, సత్యం, ధర్మం, నిబద్ధత, సంస్కారం సదాచారాలే మానవ మనుగడను కాపాడుతాయని వీటిని వీడరాదని  మనోహర్ రావు సూచించారు. బహుజన సుఖాయ బహుజన హితాయ చ అన్న లక్ష్యాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తూ పనిచేస్తున్న అబోప సంఘాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

సంస్థ గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు  సంస్థ అధికారిక వెబ్ సైటును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణ సమాజంలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన అందిరిని ఏకం చేసేందుకు ఆబోపా ఏడు సంవత్సరాల క్రితం ఏర్పడిందన్నారు. ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు సాధించడం గొప్ప విషయమన్నారు. రాజకీయంగా బలపడడానికి అబోపాతో పాటు ఇతర సంఘాలు ఐక్యతగా ముందుకు సాగాలని లక్ష్మీకాంతారావు కోరారు.  సంస్థ అధ్యక్షుడు మోత్కూర్ మనోహర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి నరసింహారావు నివేదిక సమర్పించి కరోనా సమయంలో సంఘం చేసిన సేవలను పొందుపరిచారు.

అంతకుముందు  అసోసియేషన్ బాధ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సీనియర్ జర్నలిస్టు పి.వి‌.మదన్ మోహన్ 61వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో  తాడూరి రేణుక శిష్యబృందం ప్రదర్శించిన స్వాగత నృత్యం  అలరించింది. అనంతరం డా.వేముగంటి సుశాంత్, డా.పాంచాలరాయ్,  డా.కె.రమ్య గైనకాలజిస్టు, శరత్ మాక్సి విజన్ వారి సోజన్యంతో ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి వైద్యసలహాలు ఇచ్చారు.  

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టీపుల్ కౌన్సిల్ మాజీ కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్పోరేటర్ వద్దిరాజు గణేశ్, చిట్టెం పల్లి రవీందర్ రావు, పాలకుర్తి దినకర్, పి.వి.కిరణ్ , డా.ఎన్.వి.ఎన్.చారి, మూర్తి జయప్రసాద్ కుటుంబసభ్యులు , ఆబోప జీవిత సభ్యులు పాల్గొని  ప్రముఖ సమాజ సేవకులు ఎరబాటి వామన్ రావు, పింగళి వేంకటేశ్వర్ రావు, సుమన, తాడూరి రేణుక మొదలగు వారిని సత్కరించారు.
 

click me!