తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదం: స్పందించిన బాబు, నోరు మెదపని కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Apr 24, 2019, 1:00 PM IST
Highlights

ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కాస్త ఊరటనిచ్చేలా వ్యాఖ్యలు చెయ్యడం అంతా హర్షిస్తున్నారు. కానీ సొంత రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల నిరసన కార్యక్రమాలతో అట్టుడుకుతోంది. అయితే రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో చోటు చేసుకున్న తప్పులతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం సంచలనంగా మారింది. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మందికిపైగా ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యాననో మనో వేధనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ ఫలితాలపై తప్పు జరగలేదంటూ ఒకసారి, చిన్న చిన్న తప్పులు జరిగాయని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలు చెప్తోంది ఇంటర్మీడియట్ బోర్డు. 

ఇక ప్రభుత్వం తరపున విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అయితే తన సొంత ఇంటి నుంచే మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర విమర్శలపాలవుతున్నారు. హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం, ప్రగతిభవన్, మంత్రుల నివాస సముదాల దగ్గర నిరసనలు మిన్నంటుతుంటే ఆయన రాజకీయాల గురించి మాట్లాడటంపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

టెక్నికల్ టీం వేశామంటూ చేతులుదులుపుకుంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇకపోతే హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో తప్పులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటికే విద్యార్థుల మరణాలపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలతోపాటు విద్యార్థి సంఘాలు సైతం నిరసనలు చేస్తున్నాయి. 

కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులను ఉద్దేశించి కానీ, ఇంటర్ బోర్డు వ్యవహార శైలిపై కానీ, విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా నింపేలా ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినప్పటికీ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ తరపున కేటీఆర్ కానీ, పార్టీ తరపున కానీ ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందని ఆ పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే విద్యార్థుల మరణాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.ప్రపంచ చరిత్రలో విజేతలందరి ఆరంభంలో పరాజితులేనని చెప్పిన ఆయన.. మంచి ఫలితాల కోసం ఏం చేయాలన్న దానిపై కొన్ని ట్వీట్స్ పెట్టడం గమనార్హం. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. 

ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే - బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు - దేశానికి  మీరిచ్చే బహుమతి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది.  

పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు  పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. 

అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. 

ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కాస్త ఊరటనిచ్చేలా వ్యాఖ్యలు చెయ్యడం అంతా హర్షిస్తున్నారు. కానీ సొంత రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. విద్యార్థుల మరణాలపై స్పందించకపోతే కేసీఆర్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన మీకు కనబడటం లేదా, సీఎం కుర్చీపై ధ్యాస తప్ప విద్యార్థుల రోదనలు వినిపించడం లేదా అంటూ విజయశాంతి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మరి ఇప్పటికైనా కేసీఆర్ పెదవి విప్పుతారా లేక టెక్నికల్ టీం అంటూ సరిపెడతారా అన్నది తెలియాల్సి ఉంది.  

click me!