హైదరాబాద్‌ వరదలు: రంగంలోకి ఆర్మీ, యుద్ధమైనా.. విపత్తులైనా ‘సరిలేరు నీకెవ్వరు’

By Siva KodatiFirst Published Oct 16, 2020, 8:21 PM IST
Highlights

భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందంతో భారత సైన్యం చేతులు కలిపింది. గత బుధవారం నుంచి ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందంతో భారత సైన్యం చేతులు కలిపింది. గత బుధవారం నుంచి ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

జవాన్లతో పాటు ఆర్మీ వైద్య బృందం కూడా తమ వంతు సేవలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సైన్యం హైదరాబాద్‌లో సహాయక చర్యలను ప్రారంభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ క్రమంలో అనేక ప్రాంతాల నుండి వరద బాధితులను తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరికి ఆహారం, మంచినీటిని అందజేశారు సైనికులు. భారీ వర్షం , వరదల కారణంగా హైదరాబాద్‌లో ఇప్పటివరకు 19 మంది మరణించారు.

 

 

చాలా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దాదాపుగా దెబ్బతింది. కాగా, హైదరాబాద్‌లో వరద సహాయక చర్యల గురించి సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇందులో నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు ఆర్మీ సిబ్బంది తగిన జాగ్రత్తలతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి వైద్య సేవల్ని అందించడం గమనించవచ్చు. 

స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 22 బృందాలు నగరంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 11,000 మంది వరద బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరదల్లో చిక్కుకుపోయిన అనేక మంది స్థానికులను జవాన్లు మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి రక్షించారు. అలాగే బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, ఔషధాలను చేరవేస్తున్నారు.

 

 

పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలకు తాము అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో బుధవారం సుమారు 20 సెంటీమీటర్ల వర్షం పడింది. గత వంద సంవత్సరాలలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన దాఖలాలలు లేవని అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షంతో హైదరాబాద్ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రధాన రహదారుల్లో వరద పోటెత్తుతుండటంతో కార్లు, ప్రజలు కొట్టుకుపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

 

click me!