India TV-CNX Opinion Poll Survey: బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?

By Rajesh Karampoori  |  First Published Oct 22, 2023, 3:36 AM IST

India TV-CNX Opinion Poll Survey: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కి సంబంధించి పలు ప్రీపోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం అనూహ్య ఫలితాలు వెలువడింది.


India TV-CNX Opinion Poll Survey: తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ కంటే ఎన్నికల పండుగ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి  పార్టీలన్ని తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్ని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ఎన్నికల కసరత్తు మొదలుపెట్టేశాయి. అందులోనూ అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల లిస్టును కూడా విడుదల చేసింది. మిగితా పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల లిస్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. 

కాగా.. అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈసారి కూడా బీఆర్ఎస్సే అధికారం కైవసం చేసుకుని.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించనున్నారంటూ ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా.. గత 9 ఏండ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి అధికారం కచ్చితంగా తామే అధికారం కైవసం చేసుకోబోతున్నామని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే మళ్లీ పట్టం కడుతున్నారని పలు సర్వేలు చెబుతుంటే.. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం అనూహ్య ఫలితాలు వెలువడింది.

Latest Videos

undefined

వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించినా  అంతగా ఫలితం లేదనీ ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సర్వే అంచనా వేసింది. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని,  తక్కువ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఈ ఒపీనియన్ పోల్ అంచనాలు.. 119 అసెంబ్లీ సీట్ల సభలో ఐదేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 88 సీట్లతో పోలిస్తే.. ఈ సారి ఆ పార్టీ సీట్ల వాటా 70కి తగ్గవచ్చని ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది.

అయితే.. ఐదేళ్ల క్రితం కంటే.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలత పెరిగిందనీ, గత ఎన్నికల్లో 19 స్థానాలతో గెలుపొందగా.. ఈ సారి 34 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే పేర్కొంది. ఇక మూడవ ప్రత్యర్థిగా బీజేపీ నిలువనున్నదనీ, గత సారి గెలిచిన ఒక సీటుతో పోలిస్తే.. ఈ సారి ఏడు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే.. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ కూడా ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. 2018లో ఎన్నికల్లో స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఈ సారి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే స్వతంత్రులు 'ఇతరులు' గెలువచ్చని ప్రీ-పోల్ సర్వే  వెల్లడించింది.

ఓట్ల శాతం ప్రకారంగా చూస్తే.. 

బీఆర్‌ఎస్‌కు 43 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం, బీజేపీకి 11 శాతం, ఏఐఎంఐఎంకు 3 శాతం, 'ఇతరులకు' 6 శాతం ఓట్లు రావచ్చని ఓట్ షేరింగ్ ను అంచనా వేసింది.  

ప్రాంతాల వారీగా సీటు 

> గ్రేటర్‌ హైదరాబాద్‌లో 28 సీట్లు ఉండగా.. ఇందులో బీఆర్‌ఎస్‌ - 13, ఏఐఎంఐఎం - 7, కాంగ్రెస్‌- 5, బీజేపీ- 3 సీట్లు గెలుచుకోవచ్చు. 
>> దక్షిణ తెలంగాణలో 42 సీట్లు ఉండగా.. బీఆర్‌ఎస్ 30 సీట్లు, మిగిలిన 12 సీట్లు కాంగ్రెస్‌కు దక్కవచ్చు.

>> ఉత్తర తెలంగాణలో 49 సీట్లు ఉంటే.. బీఆర్‌ఎస్ 27 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు, బీజేపీ - 4 సీట్లు, మిగిలిన ఒక్క సీటు ఇతరులకు దక్కవచ్చు.

ఎన్నికలలో ప్రధాన సమస్య

రాష్ట్రంలో నిరుద్యోగమే ప్రధాన సమస్య అని 24 శాతం మంది ఓటర్లు చెప్పారు. కాగా.. 23 శాతం మంది అవినీతి ప్రధాన సమస్య అని, 21 శాతం మంది తమకు అభివృద్ధే ప్రధాన సమస్య, 15 శాతం మంది ఓటర్లు ధరల పెరుగుదల అని చెప్పగా, 10 శాతం మంది తమకు జాతీయవాదమే ప్రధాన సమస్య అని అన్నారు.

click me!