Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రతిష్ట చర్యలు తీసుకుంటుంది. అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంత డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయంటే..?
Telangana Elections: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టాలని అధికార బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే.. ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదించాలని ప్రత్యర్థ పార్టీ ప్రయత్నాలు చేస్తోన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే.. అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం చేపట్టగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనపైనే కసరత్తు చేస్తున్నాయి.
మరో వైపు ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రతిష్ట చర్యలు తీసుకుంటుంది. గత ఎన్నికల నేపథ్యంలో అధికారుల వ్యవహార శైలి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ పలువురు ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. కర్ణాటక, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కానుకలు పెద్ద మొత్తంలో పెరగటంతో అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేస్తోంది. సరైన వివరాలు లేని నగదు ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు
ఈ నెల 9న రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రకటన విడుదలైన నాటి నుంచి 21వ తేదీ వరకు దాదాపు రూ.300 కోట్లపై చిలుకు సొమ్ము పట్టుబడింది. ఇప్పటివరకు రూ.307.02 కోట్ల విలువ చేసే నగదుతో పాటు బంగారం, మద్యం, కానుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం నాటికి (20 తేదీ) రాష్ట్రవ్యాప్తంగా రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకోగా.. కేవలం శుక్రవారం ఒక్కరోజే రూ.16.56 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే రూ.12.21 కోట్ల విలువైన మద్యం సీజ్ చేయబడింది. ప్రధానంగా హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడుతోంది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి రికార్డు స్థాయిలో నగదు, మద్యం పట్టుబడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం రూ.200 కోట్లలోపే నగదు, మద్యం పట్టుబడింది.
షెడ్యూల్ విడుదలైన పది రోజుల్లోనే గతంలో కంటే అధికంగా పట్టుబడింది. నామినేషన్లు, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య నాటికి ఎంత మొత్తం స్వాధీనం అవుతుందో వేచి చూడాలి. మరోవైపు ఎన్నికల కోడ్ పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరాలు వ్యాపారాలు బ్యాంకులకు వెళ్తున్న సమయంలో తమని పట్టుకున్నారని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మద్యం షాపుల యాజమానులు, ఇతర వ్యాపారస్తులు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.