CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. రెండో జాబితా పై చర్చించేందుకు శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.
CONGRESS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టగా.. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థల ఎంపికపై కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 55 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. అతి తర్వలో రెండో జాబితాను విడుదల చేసి పార్టీ కేడర్ లో జోష్ తీసుకురావాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండో జాబితా పై చర్చించేందుకు శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండో జాబితాను ఈ నెల 25 తర్వాత రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో రెండో జాబితాకు ఆమోదం రానున్నది. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు.
అలాగే.. భేటీలో లెఫ్ట్, తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తు విషయంపై కూడా చర్చించనట్టు సమాచారం. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరేవారికి అవకాశం కల్పిస్తూ .. తుది జాబితాను తయారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పలు నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు దొరికినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశంతో రానున్న ఒకట్రెండు రోజుల్లో టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానున్నది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మాణిక్ ఠాక్రే మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు జరుగుతోందని, సీనియర్ నేతలతో చర్చించామని తెలిపారు. త్వరలోనే రెండో జాబితాను ప్రకటిస్తామని, లెఫ్ట్ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, అతి తర్వలో లిస్ట్ ఖరారు కానున్నదని ఠాక్రే స్పష్టం చేశారు.
అంతకుమందు మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్ .. తెలంగాణలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. మూడు రోజుల రాహుల్ బస్సు యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రాహుల్ గాంధీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తారని, అనుకూల పరిస్థితులు ఉపయోగించుకునేలా రానున్న రోజుల్లో రాహుల్ ప్రియాంక మరింత దృష్టి పెట్టబోతున్నారని తెలిపారు