
ఉప్పు, నిప్పులా ఉండే భారత్, పాక్ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయంతో ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా ఒకే బాటలో నడుస్తున్నాయి. అది తమ దేశాల కరెన్సీ ముద్రణల విషయంలో...
నోట్ల తయారీకి ముఖ్యంగా నకిలీ బెడద నుంచి తప్పించుకునేందుకు మన దేశం కరెన్సీలో తగు జాగ్రత్తలు తీసుకుంది. కరెన్సీ లోపల ఇంక్‌తో వాటర్ మార్క్ లో అక్షరాల ముద్రణ, కరెన్సీ మధ్యలో సిల్వర్‌థ్రెడ్‌ను అమర్చడం ఇందులో భాగమే. అయితే ఈ రెండింటిని లండన్ కు చెందిన ఒక సంస్థ భారత్ కు సరఫరా చేస్తుంది. వాటితో నాసిక్ తదితర ప్రదేశాలలో కేంద్రం కొత్త కరెన్సీని ముద్రిస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మన దేశానికి వీటిని సరఫరా చేస్తున్న సంస్థనే పాకిస్థాన్ కు కూడా అందిస్తుంది.
ప్రత్యక్ష యుద్ధంలో భారత్ తో తలపడలేని పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. భారత్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు దొంగనోట్లను ఐఎస్ఐ ఉగ్ర సంస్థ ద్వారా ముద్రించి మన దేశంలోకి బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి సరఫరా చేస్తుంది.
ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో పాక్ పన్నాగం దెబ్బతిందని మనం సంతోషించే లోపే మరో విషయం బయట పడింది. ఇప్పుడు కొత్తగా ముద్రిస్తున్న రూ.2 వేల కరెన్సీ నోట్ల ఇంక్ , సిల్వర్ థ్రెడ్ ను కూడా ఆ సంస్థ మనకు అందజేస్తుంది.
దీని వల్ల పాక్ కొత్త రూ.2 వేల నోట్లను సులువుగానే ముద్రించే అవకాశం ఉంది. ఈ విషయం కేంద్రానికి తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంతుచిక్కని ప్రశ్న.
ఇదే ప్రశ్నను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా లేవనెత్తారు. కొత్త కరెన్సీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఆయన తప్పు పట్టారు.నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఎలాంటి వ్యూహం అనుసరించనుందో చెప్పాలి అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.