పకడ్బందీ వ్యూహంతోనే మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్ వ్యాపారుల రూపంలో ఐటీ అధికారులు కొంత కాలంగా మల్లారెడ్డి అనుచరులతో టచ్ లోకి వెళ్లారు.
హైదరాబాద్: పకడ్బందీ వ్యూహంతోనే ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల బ్యాంకు ఖాతాలపై ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. రియల్ ఏస్టేట్ వ్యాపారుల పేరుతో మంత్రి మల్లారెడ్డి సహా ఆయన అనుచరులకు ఐటీ అధికారులు కొంతకాలంగా టచ్‌లోకి వెళ్లారని ప్రచారం సాగుతుంది. మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండేవారితో పాటు ఇదే విషయమై ఐటీ అధికారులు చర్చించారు.కానీ తాను భూములు కొనుగోలు చేయనని మంత్రి మల్లారెడ్డి వైపు నుండి సమాచారం వచ్చిందని తెలిసింది.
డబ్బులు అవసరం ఉండి భూమిని విక్రయిస్తున్నట్టుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి అనుచరులను నమ్మించే ప్రయత్నం చేశారు. తక్కువ ధరకు భూములిస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు బ్లాక్ లో డబ్బులిచ్చినా ఫర్వాలేదనే సమాచారం కూడా పంపారు. అయినా కూడా మల్లారెడ్డి నుండి సానుకూలంగా స్పందన రాలేదు.
మంత్రి మల్లారెడ్డి తనయుడు, అల్లుడు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం. దీంతో రియల్ ఏస్టేట్ వ్యాపారుల అవతారంలో ఐటీ అధికారులు స్కెచ్ వేశారు. మరోవైపు ఐటీ అధికారులు ఆరు మాసాలుగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు సుమారు 300 బ్యాంకు ఖాతాలను కూడ ఐటీ అధికారులు స్టడీ చేస్తున్నారు.
also read:నా కొడుకును చూడనివ్వడం లేదు: సూరారం ఆసుపత్రి వద్ద మంత్రి మల్లారెడ్డి బైఠాయింపు
నిన్న ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రివరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ సోదాలు సాగుతున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సూరారంలోని నారాయణ ఆసుపత్రిలో మహేందర్ రెడ్డిని చేర్పించారు.సూరారంలోని నారాయణ హృదయాలయం వద్ద మంత్రి మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. కొడుకును చూడనివ్వడం లేదని ఆసుపత్రి ముందు మంత్రి మల్లారెడ్డి ఆందోళనకు దిగారు.