హైదరాబాద్‌లో మియాపూర్ పోలీసులు లంచం తీసుకోవడానికి సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారనే చర్చ నడుస్తున్నది. రెండు వారాల క్రితం రూ. 50 వేల లంచం తీసుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన హెడ్ కానిస్టేబుల్ కేసు నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. పోలీసు స్టేషన్ వెనుక ఉంచిన ఆటోలో లంచం డబ్బులు ఉంచాలని ఫిర్యాదుదారుడికి సూచించడం గమనార్హం.
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు వారాల క్రితం వెలుగు చూసిన అవినీతి కేసు సంచలనం కలిగించింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి మియాపూర్ పోలీసులు ఎలాంటి సంశయం లేకుండా లంచం అడిగిన ఘటన ప్రజల్లో, పోలీసు శాఖలోనూ కలకలం రేపింది. రూ. 50 వేల లంచంలో మొదటి విడత పొందడానికి వారు చేసిన ఏర్పాటు కూడా చర్చనీయాంశమైంది. లంచం పొందడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే చర్చ మొదలైంది. కొందరు పోలీసుల అవినీతి పోలీసు శాఖకే మచ్చ తెస్తుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
మియాపూర్ పోలీసు స్టేషన్‌కు సమస్యతో ఓ వ్యక్తి వచ్చాడు. ఆ సమస్యను పోలీసులకు వివరించాడు. కానీ, ఆ సమస్య తీర్చాలంటే ఖర్చవుతుందని నిర్మొహమాటంగా పోలీసులు తేల్చేశారు. రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన ఆ ఫిర్యాదు దారుడు రూ. 30 వేలు ముందు ఇచ్చి.. పని జరిగిన తర్వాత మిగిలిన రూ. 20 వేలు ఇస్తానని చెప్పాడు. డీల్ కుదిరింది.
రూ. 30 వేల లంచం తీసుకోవడానికి ఒక కొత్త ప్లాన్ వేశారు. నేరుగా ఆ వ్యక్తి చేతుల నుంచి తీసుకోకుండా.. ఎవరి కంట పడకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ భవనం వెనుక ఓ ఆటో ఉండగా.. అందులో ప్యాసింజర్ సీటు వెనుకాల రూ. 30వేల లంచం డబ్బులు ఉంచాలని ఆ ఫిర్యాదు దారుడిని ఆదేశించారు. అతను అలాగే చేశాడు.
ఆటోలోని డబ్బును హెడ్ కానిస్టేబుల్ దండే వెంకటర్ రెడ్డి కలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఫిర్యాదు దారుడు ఇంకా రూ. 20 వేలు పోలీసులకు ఇవ్వాల్సి ఉన్నది. లంచం ఇవ్వడం మానుకుని ఆ వ్యక్తి ఏసీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని చెప్పేశాడు. ఏసీబీ అధికారులు మాటువేశారు. మిగిలిన రూ. 20 వేల హెడ్ కానిస్టేబుల్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ హెడ్ కానిస్టేబల్ లంచం డబ్బులను ఎస్ఐ యాదిగిరి సూచనల మేరకే తీసుకున్నానని చెప్పడంతో ఇద్దరిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఏసీబీ అధికారులు ఇక్కడ వ్యవహరించిన తీరు కొత్తగా ఉండటం పలువురిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది.
హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. ఎస్ఐ యాదగిరికి మాత్రం నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. తొలిసారి చిక్కినందువల్లే నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినట్టు బ్యూరో సీనియర్లు కొందరు తెలిపారు. అయితే, గతంలో ఇలా తొలిసారి చిక్కిన అధికారులను వదల్లేదని, అరెస్టు చేసి దర్యాప్తు చేశారని పలువురు పేర్కొంటున్నారు.
ఎస్ఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబ డలేదని, కాబట్టే ఆయనను అరెస్టు చేయ లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. తమ జూనియర్లతో లంచం తెప్పించుకునే అధికారులు చిక్కినప్పుడు వారిని అరెస్టు చేసిన దాఖలాలు ఉన్నా యనే చర్చ జరుగుతున్నది.