
తెలంగాణలోనూ ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయంగా చర్చ మొదలైంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్‌ను కలవడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ముస్లిం పర్సనల్ బోర్డు ప్రతినిధులతో సమావేశం కావడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ సందర్భంలో సీఎం కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేసి కామెంట్ చేశారు.
ఉమ్మడి పౌరస్మృతి విషయమై అసదుద్దీన్, ఆ తర్వాత ముస్లిం పెద్దలతో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారనే విషయాన్ని ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతిని తెచ్చి తీరుతుందని, పార్లమెంటులో ఈ బిల్లును సునాయసంగా ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది అనిపిస్తే దేశం వదిలి వెళ్లిపోవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లితే ఎవ్వరూ వద్దనరని పేర్కొన్నారు.
Also Read: దొంగ భక్తుడు! హనుమాన్ చాలీసా చదివి రూ. 10 సమర్పించి.. హుండీ పగులగొట్టి డబ్బులతో పరార్
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కొన్ని చానెల్స్ కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని, ఇది కేసీఆరే ఈ ప్రచారం చేయించారని ఆరోపించారు. కానీ, ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లుతున్నాయనే సమాచారం రాగానే.. యూసీసీని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పుడు కొత్త వైఖరి ఎత్తుకున్నారని తెలిపారు.