Latest Videos

ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యలు .. రేవంత్ అలా అనలేదు, బీఆర్ఎస్ వక్రీకరణ, సీఎం అవ్వాలన్న ఆశల్లేవు: సీతక్క

By Siva KodatiFirst Published Jul 11, 2023, 9:11 PM IST
Highlights

ఉచిత విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని బీఆర్ఎస్ ఎదురుచూస్తోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఉచిత విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తానంటూ అన్న మాటలు సొంత పార్టీలోనూ కలవరపాటుకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో సీతక్క స్పందించారు. మంగళవారం అమెరికా నుంచి తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ను మరింత మెరుగ్గా అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. అమెరికాలో ఒకరు అడిగిన ప్రశ్నకు రేవంత్ అలా సమాధానం ఇచ్చారని ఆమె తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలపై విష ప్రచారం చేస్తున్నారని.. రైతులకు 24 గంటల కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానమని సీతక్క స్పష్టం చేశారు. 

మా మేనిఫెస్టోలో మూడు గంటలే కరెంట్ ఇస్తామని రేవంత్ అనలేదని ఆమె తెలిపారు. దేశంలో ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ నిరసనలు చేయడం ఎక్కడైనా చూశామా అంటూ బీఆర్ఎస్‌కు సీతక్క చురకలంటించారు. అధికారంలో వున్న మీరు రైతులకు లాభం చేయరు, మేం చేస్తామంటే విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అన్నింటికి వివరణ ఇస్తారని సీతక్క తెలిపారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని బీఆర్ఎస్ ఎదురుచూస్తోందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అసమ్మతితో కొట్టుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు అపార నమ్మకం వుందని సీతక్క అన్నారు. 

సీఎం పదవి గురించి మాట్లాడినప్పుడు తాను పక్కనే వున్నానని అందుకే రేవంత్ అలా అన్నారని ఆమె తెలిపారు. అవకాశం వుస్తే సీతక్క కూడా సీఎం అవుతుందనే రేవంత్ అన్నారు కానీ , చేస్తామని ఎక్కడా చెప్పలేదని సీతక్క క్లారిటీ ఇచ్చారు. ఎవరినో తగ్గించాలి, ఇంకెవరినో పెంచాలన్నది రేవంత్ ఉద్దేశం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశం వుంటుందనే ఉద్దేశంతోనే రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారని సీతక్క తెలిపారు. అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు.  తనకు సీఎం కావాలన్న ఆశలేమీ లేవని.. ఎన్నికల తర్వాత సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసే దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 

click me!