హైదరాబాద్ లోని నా ఇంట్లోనే సీబీఐని కలుస్తాను.. ఎమ్మెల్సీ కవిత...

By SumaBala BukkaFirst Published Dec 3, 2022, 7:34 AM IST
Highlights

డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లోని తన నివాసంలోనే సీబీఐ అధికారులను కలవనున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమెకు శుక్రవారం సీబీఐ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నేత కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అరెస్టైన అమితక అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శుక్రవారంనాడు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసు జారీ చేయబడింది. ఈ నోటీసులో డిసెంబర్ 6వ తేదీన ఉదయం పదకొండు గంటలకు దీనిమీద వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని పేర్కొన్నారు. 

ఈ నోటీసు వచ్చిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత దీనిమీద స్పందించారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో నా పేరు ఉండడం మీద వివరణ కోరుతూ సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద నాకు సీబీఐ నోటీసు జారీ చేయబడింది. అందులో వారు పేర్కొన్న ప్రకారం... వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను’ అని తెలిపారు. 

బీజేపీ ప్రభుత్వం సంక్షేమ‌ పథకాలను రద్దు చేయదు.. టీఆర్ఎస్ తీరుపై బండి సంజయ్ ఫైర్

ఈ నోటీసులో సీబీఐ అధికారులు ఈ నెల ఆరో తేదీన కవితను సీబీఐ విచారణకు హాజరు కావాలని కోరుతూ.. ఆమె దీనికోసం ఢిల్లీలో లేదా హైదరాబాద్ లో ఏదో ఒక చోట వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలోనే సీబీఐ అధికారులను కలవనున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ నాయకుల మీద ఐటీ రైడ్స్ పేరిట ఈడీ దాడులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. మోడీ వచ్చేముందు రాష్ట్రానికి ఈడీ రావడం మామూలే అన్నారు. కావాలని కక్ష పూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని.. ఇబ్బందులకు గురి చేయాలని నాయకులను వరుసపెట్టి టార్గెట్ చేస్తోందని అన్నారు. తెలంగాణను ఆక్రమించాలన్న భావంతోనే ఇదంతా చేస్తోందని దుయ్యబట్టారు.

మేము దేనికైనా సిద్ధమే.. తప్పు చేస్తే భయపడతాం కానీ... చేయకుండా భయపడం అన్నారు. అంతేకాదు బెదిరించి ఏం చేస్తారు.. మా అంటే జైల్లో పెడతారు. అంతకుమించి ఏం చేయలేరు కదా.. తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారు. అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో ఇవి పనికి రావు అంటూ నిప్పులు చెరిగారు. 

click me!