నేడు హైదరాబాద్ టీఆర్ఎస్ జనరల్ ‌బాడీ సమావేశం.. జాతీయ పార్టీపై చర్చ..!

By Sumanth KanukulaFirst Published Oct 3, 2022, 10:51 AM IST
Highlights

టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహకాలు జరుగుతున్నాయి. 

టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. దసరా పండగ రోజున(అక్టోబర్ 5) మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్న  283 మంది టీఆర్ఎస్ నాయకులు.. కొత్త పార్టీకి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించనున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక, టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చనున్న కేసీఆర్.. పార్టీ పేరును  భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మార్చేందుకు రెడీ అయ్యారు. అయితే పార్టీ గుర్తుగా మాత్రం ‘‘కారు గుర్తు’’నే కొనసాగించనున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్‌లో విలీనం అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

జాతీయ పార్టీ ఏర్పాటుకు పెద్ద మొత్తంలో సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డివిజన్ అధ్యక్షులు హాజరుకానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేసే అవకాశముందని తెలుస్తోంది.దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read: ఈ నెల 5 మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ: 283 మందితో తీర్మానం చేయనున్న టీఆర్ఎస్

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక జరిగితే.. కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిని బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై నిలబెట్టే అవకాశం ఉంది. ఇక, ప్రగతి భవన్‌లో ఆదివారం తన మంత్రులు, మొత్తం 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశమ్యారు. ఈ సమావేవంలో దేశంలో బీజేపీ దుష్టపాలనను అంతం చేసేందుకు జాతీయ పార్టీ ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు.

అక్టోబరు 5న జరిగే టీఆర్‌ఎస్‌ సమావేశంలో పార్టీ పేరు మార్పుపై చర్చిస్తామని కేసీఆర్‌తో భేటీ అనంతరం టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.  ‘‘దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ఆవిర్భవిస్తుందని అనుకున్నాం. కానీ పలు రాష్ట్రాల్లో డిపాజిట్లు కూడా పొందలేకపోయింది. బీజేపీని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ, ఎజెండా అవసరం ఉంది’’ అని టీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

click me!