
కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్‌ను నేతలు పరిశీలించనున్నారు. అలాగే రాహుల్ పాదయాతకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా టీ కాంగ్రెస్ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ నేతలు రాహుల్ పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో 13 రోజుల పాటు కొనసాగనుంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.
అయితే తొలుత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఔటర్ రింగ్ రోడ్, వికారబాద్ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా రూట్ మ్యాప్ ప్రకారం.. రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్, ఆరామ్‌గఢ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా వెళుతుంది.
అయితే చార్మినార్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర వెళ్లనున్న నేపత్యంలో.. అక్కడి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాహుల్ సందర్శించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక, తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు.. డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా కలిశారు. భద్రతా ఏర్పాట్లు చేసేందుకు డీజీపీ అంగీకరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతుంది. అక్టోబర్ 24 న తెలంగాణలోకి ప్రవేశించనుంది.
ఇక, రాహుల్ పాదయాత్రపై సమన్వయం చేసుకోవడానికి మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పాదయాత్రను సమన్వయం చేసుకోవడంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టుగా చెప్పారు.
మహారాష్ట్ర, తెలంగాణ నాయకుల బృందం కర్ణాటకకు వెళ్లి అక్కడ రాహుల్ పాదయాత్రను అధ్యాయనం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలనేదే తమ ఆరాటమన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. రాహుల్ పాదయాత్ర గాంధీజీ చేపట్టిన దండియాత్ర లాంటిదేనని అన్నారు.