
నిబంధనలు పాటించని వారి పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (black films) వుంచుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు .. భారీ జరిమానాలు విధిస్తున్నారు. కొద్దిరోజులుగా పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రెటీలకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా శనివారం హీరో ప్రభాస్ (prabhas) కారుకి చలాన్ వేశారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ కారుకి ఫైన్ వేశారు. ఎంపీ స్టిక్కర్, నంబర్ ప్లేట్, బ్లాక్ ఫిల్మ్ వుండటంతో రూ.1450 ఫైన్ వేశారు.
కొద్దిరోజుల క్రితం .. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)కారుకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నాగ చైతన్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంది. కారులో ప్రయాణించే వ్యక్తులు కనిపించకుండా అద్దాలకు అడ్డుగా ఉండే బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని చాలా కాలం క్రితమే నిషేధించారు. అయినప్పటికీ కొందరు తమ కార్లకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్నారు. నాగ చైతన్య కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గమనించిన పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆపారు.
నిబంధలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ కలిగి ఉన్న నేపథ్యంలో రూ. 700 జరిమానా విధించారు. అలాగే అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు.జరిమానా చెల్లించిన అనంతరం చైతన్య అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ సైతం ఇదే కేసులో జరిమానా చెల్లించారు. ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ గమనించిన పోలీసులు ఫైన్ విధించడం జరిగింది. నేరాలను అరికట్టే క్రమంలో బ్లాక్ ఫిల్మ్ వాడకం నిషేదించారు. కొందరు సెలెబ్రిటీలు మాత్రం పబ్లిక్ లో కనిపిస్తే ఎదురయ్యే ఇబ్బందుల రీత్యా.. బ్లాక్ ఫిల్మ్ ఇంకా వాడుతున్నారు.