CM Revanth:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జపాన్ ప్రతినిధులతో పలు ఒప్పందాలను కుదురుచ్చుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. అక్కడ పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న విషయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కిటాక్యుషు నగర మేయర్ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు భేటీ అయ్యారు.
హైదరాబాద్‌ను కూడా కిటాక్యుషు నగరం మాదిరిగా అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించవచ్చని సీఎం అన్నారు. ఉద్యోగాల కల్పన, అభివృద్ది, పర్యవారన పరిరక్షణ, సంపద సృష్టి చేపట్టేందకు తమ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు.
శుభ్రమైన, సుస్థిర నగరంగా...
హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా కిటాక్యుషు మేయర్‌తో ఒప్పందాలు జరిగాయని సీఎం రేవంత్ తెలిపారు. ఒకప్పుడు కిటాక్యుషు కూడా పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడగా.. ఆ తర్వాత ఇక్కడి ప్రభుత్వం అధికారుల చొరవ, ప్రజల భాగస్వామ్యంతో నేడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా మారిందని మేయర్ టేకుచి సీఎంకు తెలిపారు. ఆ సందర్బంగా అక్కడ చేపట్టిన కార్యక్రమాలను టెక్నాలజీ వినియోగం గురించి వివరించారు. హైదరాబాద్ నగరాన్ని సైతం ఇదే రీతిలో అభివృద్ది చేసేందుకు మేయర్ టేకుచి ఆసక్తి చూపారని తెలంగాణ బృందం అంటోంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు..
ఇక హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాలపై ఇద్దరూ కలిసి పనిచేయనుంది. దీంతోపాటు పర్యావరణ అనుకూల టెక్నాలజీ వినియోగం, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునరుజ్జీవ విధానాలపై కొంతసేపు చర్చించారు. అనంతరం ఈఎక్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయి. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఎల్‌ఓఐపై అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధుల మధ్య సంతకాలు జరిగాయి.
హైదరాబాద్‌లో యువతికి జపాన్ భాష..
జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలు విషయాలను పరిశీలించారు. అక్కడ యువ శక్తి కొరత తీవ్రంగా ఉందని హైదరాబాద్‌లో యువతికి జపాన్ భాష నేర్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తాయని అన్నారు. త్వరలో భాగ్యనగరంలో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీఎం ప్రస్తావించారు. జపాన్ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉంటే .. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తి అందుబాటులో ఉందని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్- కిటాక్యుషు నగరాల మధ్య విమాన ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చింది.
జపాన్‌లోని మురాసాకి పునరుజ్జీవ ప్రాజెక్టును తెలంగాణ బృందం పరిశీలించింది. గతంలో కాలుష్య కూరల్లో చిక్కుకున్న ఈ నది నేడు పరిశుభ్రమైన నదీతీరంగా మారిన విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టు తీర్చిదిద్దిన విధానం గురించి అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.