Hyderabad: ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం మొత్తం తిరిగి ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
Telangana New Secretariat to be inaugurated on April 30: ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం మొత్తం తిరిగి ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
వివరాల్లోకెళ్తే.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో నూతన తెలంగాణ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేదపండితులు నిర్ణయించిన శుభ సమయం ప్రకారం సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. త్వరలోనే సమయాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ తొలుత తన చాంబర్ లో కూర్చుంటారు. అనంతరం మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, ఇతర సచివాలయ సిబ్బంది తమ చాంబర్లను ప్రవేశించనున్నారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొంటారని సమాచారం. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు.
సెక్రటేరియట్ కు నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఉత్తర, పడమర గేట్లను తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు ఈశాన్య ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఆగ్నేయ ద్వారం సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్య ఆహ్వానితులు, విదేశీ అతిథులకు మాత్రమే తూర్పు ద్వారం (మెయిన్ గేట్)ను ఉపయోగిస్తారు.
వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రికల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయివేటు వాహనాలకు అనుమతి లేదుని పేర్కొన్నారు. సెక్రటేరియట్ భద్రతకు సంబంధించి డీజీపీ విధివిధానాలను రూపొందించి భద్రతా చర్యలు తీసుకుంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.