
నేటి యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. కాస్తా ఒత్తిడి కూడా తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో.. నాన్న కొట్టాడనో.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో..ప్రేమలో విఫలమైందనో.. నచ్చిన జాబ్ రాలేదనో.. ఇలా చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి చిన్నా.. పెద్ద సమస్యకు ఆత్మహత్య పరిష్కారమని భావిస్తున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా.. చావుతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో చోటు చేసుకుంది. ప్రియుడి మరణవార్త తట్టుకోలేని ప్రియురాలు.. అతడి లేని లోకంలో తాను ఉండలేనంటూ ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. నేహా (19) యువతి అనే గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో ఒక హాస్టల్ లో ఉంటూ బరిష్టా కేఫ్ లో పనిచేస్తోంది. అదే కేఫ్ లో సహా ఉద్యోగి అయిన సల్మాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే.. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్ శనివారం నాడు బాలాపూర్ వెంకటాపురం లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రియుడి సల్మాన్ మరణవార్త తట్టుకోలేని ప్రియురాలు నేహా.. అతడి లేని లోకంలో తాను ఉండలేనంటూ మంగళవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. దాంతో వీరి ప్రేమ కథ మరీ విషాదంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.