తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు చిరకాలం గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ నుండి విఎస్టి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కు తన ఉద్యమ సహచరుడు నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా, అంతకుముందు కార్మిక సంఘం నాయకుడిగా చేసిన సేవలకు గుర్తుగా ఆ ప్రాంతంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెడుతోంది బిఆర్ఎస్ ప్రభుత్వం.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ప్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) లో భాగంగా ఇప్పటికే అనేక ప్లైఓవర్ల నిర్మాణం పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో వున్నాయి. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ నుండి అశోక్ నగర్, ఆర్టిసి క్రాస్ రోడ్ మీదుగా విఎస్టి వరకు రూ.450 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జిని రేపు(శనివారం) మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Read More మూసీ పరిసరాల పేదలకు కేటీఆర్ గుడ్ న్యూస్... పదివేల డబుల్ బెడ్రూం ఇళ్లు వారికే..
2020 లో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా 2021 లో పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని హైదరాబాద్ లో మొదటి స్టీల్ బ్రిడ్జిని పూర్తిచేసారు. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇందిరాపార్క్, ఆర్టిసి క్రాస్ రోడ్, విద్యానగర్ ప్రాంతాల ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టడంపై ముషిరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.