
హైదరాబాద్‌లో 90 శాతానికి పైగా రిక్రూటర్లు తమ నియామక బడ్జెట్‌లో సగం వరకు మొత్తాన్ని టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హైరింగ్ టూల్స్ మీద ఖర్చు చేస్తున్నారు. ఈ అంశాన్ని లింక్డ్ఇన్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. నియామక ప్రక్రియలో వేగం, నాణ్యత పెరగడం, వృథా పనుల తొలగింపు వంటి అనేక కారణాలతో రిక్రూటర్లు AI టూల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
లింక్డ్ఇన్ రీసెర్చ్ ప్రకారం, AI టూల్స్ వినియోగం వల్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతోంది. ముఖ్యంగా: అభ్యర్థుల స్క్రీనింగ్, షెడ్యూలింగ్, ఫీడ్‌బ్యాక్ వంటి రిపిటేటివ్ పనులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. స్కిల్స్ ఆధారంగా సరైన అభ్యర్థిని గుర్తించడం సులభమవుతోంది. మానవ వనరుల శాఖలు ఇక నిశితంగా ప్రణాళికలు రూపొందించి, వ్యూహాత్మక సూచనలు చేయగలుగుతున్నాయి. అభ్యర్థులకు మెరుగైన అనుభవం కలిగించగలుగుతున్నాయి. ఈ ప్రయోజనాలే హైదరాబాద్ వంటి టెక్-సిటీకి AI ఆధారిత నియామక వ్యవస్థను ఆకర్షించడానికి కారణమవుతున్నాయి.
హైదరాబాద్‌కి చెందిన రిక్రూటర్లలో 79% మంది 'quality of hires' (అభ్యర్థి పనితీరు నాణ్యత) ను అత్యున్నత ప్రమాణంగా తీసుకుంటున్నారు. ఇక 61% మంది 'time to hire' (ఎంత కాలంలో ఉద్యోగిని నియమించగలిగారో)ను చూస్తుంటే, 60% మంది ‘employee retention’ (ఉద్యోగులు సంస్థలో ఎంతకాలం కొనసాగుతున్నారో)ను విజయ ప్రామాణికంగా భావిస్తున్నారు. ఇవి మూడూ కలిసి ఒక సంస్థ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాలుగా పరిగణిస్తారు.
గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) కోసం సరైన అభ్యర్థులను ఎంచుకోవడం కష్టంగా మారుతోంది. దీనికి గల కారణాలు.. స్థానికంగా అందుబాటులో ఉన్న స్కిల్స్, గ్లోబల్ అవసరాలకు సరిపోకపోవడం, అభ్యర్థులకు సరైన ట్రైనింగ్ అవకాశాలు లేకపోవడం. ఈ రెండు సమస్యలు కంపెనీలకు మానవ వనరులలో ఖాళీలు ఉన్నా, అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించడంలో ఆటంకంగా మారుతున్నాయి.
లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లోని 90%కు పైగా రిక్రూటర్లు తాము ఇక "స్ట్రాటజిక్ కెరియర్ అడ్వైజర్స్"గా ఎదగాలనుకుంటున్నారు. అలాగే 94% మంది రిక్రూటర్లు అభ్యర్థులతో ముడిపడి ఉన్న డేటాను అనలైజ్ చేసి, వారి ఆసక్తిని రాబట్టాలనుకుంటున్నారు. ఇది భవిష్యత్ నియామక విధానానికి ఒక కొత్త దిశను సూచిస్తోంది.