
ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్ధవుతోంది. దీంతో నగరంలోని నాళాలు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. ప్రధానంగా హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా.. ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం వుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు.. GHMC పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన Rain కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఐదు రోజులుగా Hyderabad నరంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుండి నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండొద్దని కూడా అధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
Also Read:హైద్రాబాద్‌లో ఈదురుగాలులతో 12 గంటలపాటు వర్షాలు: అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచన
గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఈదురు గాలుల కారణంగా చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీల, హౌర్డింగ్ లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెట్రో పిల్లర్లపై ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా అధికారులు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 40 బృందాలు పనిచేస్తున్నాయి. వర్షం, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ బృందాలు పనిచేస్తున్నాయి.
ఇకపోతే.. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.