
కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని.. కార్యకర్తలపై చెయ్యేస్తే ఆ చేయిని నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి గొర్రెలు, బర్రెలు గుర్తుకొస్తాయని ... తీరా గెలిచిన తర్వాత అన్నీ మరిచిపోతారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. సంపన్న రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబీలోకి నెట్టేశారని.. గ్రామ పంచాయతీలు నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి (bjp) అంత సీన్ లేదని.. గ్రామ స్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు లేరని వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ALso Read:అసంతృప్తి లేదు, అలా అయితే బిల్యా నాయక్ చేరిక కూడా చెల్లదు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పార్టీలో చురుకుగానే ఉన్నానని ఎలాంటి అసంతృప్తితో లేనని Komatireddy Venkat Reddy ప్రకటించారు. ఆదివారం నాడు తన నివాసం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. Congress పార్టీని బలోపేతం చేసినవారికే టికెట్లు ఇవ్వాలన్నారు. తాను ఇదే విషయాన్ని అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా వెంకట్ రెడ్డి చెప్పారు. పీఏసీ సమావేశాలకు తాను రాలేనని ఇదివరకే చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.
29 మందితో PAC ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇంత మందితో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి వెళ్లి తాను ఏం మాట్లాడాలని వెంకట్ రెడ్డి తెలిపారు. పీఏసీ సంఖ్యను నాలుగు లేదా ఐదుగురికి కుదించాలని ఆయన కోరారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లకపోతే దేవరకొండకు చెందిన బిల్యానాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లుబాటు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బిల్యానాయక్ గతంలో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.