ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్ధులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: ఐఐటీ- జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్ధులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఐదుగురు విద్యార్ధులకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. అంతేకాదు ఐదుగురు విద్యార్ధులపై పోలీసులు ఐపీసీ 138, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు విద్యార్ధులు హైద్రాబాద్ లోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి సికింద్రాబాద్ లోని పరీక్ష సెంటర్ లో పరీక్ష రాశాడు. ఈ విద్యార్ధి తాను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లిన సెల్ ఫోన్ ద్వారా తన మిగిలిన నలుగురు స్నేహితులకు జవాబులు పంపారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే సమయంలో ఈ ఐదుగురు విద్యార్ధులు తమ లో దుస్తుల్లో సెల్ ఫోన్లను పెట్టకున్నారు.
also read:ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: పోలీసుల అదుపులో కడప విద్యార్ధి
పరీక్ష కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతించే సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు. అయితే ఈ ఐదుగురు విద్యార్ధులు తమ లో దుస్తుల్లో ఫోన్లు తీసుకెళ్లిన సమయంలో సిబ్బందికి ఈ ఫోన్లు ఎందుకు కన్పించలేదనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ఈ ఐదుగురు విద్యార్ధులకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెన్త్, ఇంటర్ లలో టాపర్ గా నిలిచిన విద్యార్ధి తన స్నేహితులకు ఐఐటీ జేఈఈలలో సహాయం చేయాలని భావించాడు. పరీక్షలు రాయడానికి ముందే ఈ ఐదుగురితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.
ఐఐటీ జేఈఈ పరీక్షలో తాను రాసిన సమాధానాలను కడప విద్యార్ధి తన ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. అయితే పరీక్షల తనిఖీకి వచ్చిన అబ్జర్వర్ సికింద్రాబాద్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న కడప విద్యార్ధి తీరుపై అనుమానపడ్డాడు. ఆ విద్యార్ధిని అబ్జర్వర్ తనిఖీ చేశాడు. ఈ తనిఖీలో విద్యార్ధి వద్ద సెల్ ఫోన్ లభ్యమైంది. ఆ విద్యార్ధిని ప్రశ్నించగా హైద్రాబాద్ లోని సెంటర్లలో మరో నలుగురు విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నట్టుగా విద్యార్థి సమాచారం ఇచ్చాడు ఈ ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఐదుగురు విద్యార్ధులకు ఎవరెవరు సహకరించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.