
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమ్నేషియా పబ్ (amnesia pub rape case) అత్యాచార ఘటనపై హైదరాబాద్ పోలీసులు (hyderabad police) మీడియా ముందుకు వచ్చారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని మే 31న ఆమె తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మే 28న ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. రెండు రోజులు బాధితురాలు షాక్‌లో వుందని.. మహిళా పోలీసులకు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరి పేరు మాత్రమే బాలిక చెప్పగలిగిందని డీసీపీ చెప్పారు. అయితే మొత్తం ఐదుగురు నిందితులు వున్నట్లు బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.
దర్యాప్తులో ఐదుగురిని గుర్తించామని.. వీరిలో ఇద్దరు మేజర్లు కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లనీ డీసీపీ తెలిపారు. 48 గంటల్లో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. మరో మైనర్ నిందితుడిని కుటుంబం కస్టడీలోనే వుంచామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన ముగ్గరినీ మరో 48 గంటల్లోగా అదుపులోకి తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు వున్నాడే వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌లో హోంమంత్రి మనవడు (telangana home minister mahmood ali ) ఎక్కడా లేడని డీసీపీ వెల్లడించారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యం కాలేదని ఆయన చెప్పారు.
అత్యాచార ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని.. దర్యాప్తు వేగవంతం చేశారని అలీ అన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించమని హోంమంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు ఈ కేసులో ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ స్పందించారు. అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వున్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేసిన వారు నిజానిజాలు తెలుసుకోవాలంటూ పుర్ఖాన్ అన్నారు.