
హైదరాబాద్ పోలీసులు (hyderabad police) హైకోర్టు (telangana high court) ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. డ్రైంకెన్ డ్రైవ్ (drunk and drive ) సందర్భంగా వాహనాలను సీజ్ (vehicles seiz) చేయొద్దని శుక్రవారం తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒకవేళ వాహనాలను సీజ్ చేసిన పక్షంలో వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే శనివారం సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ సందర్భంగా పట్టుబడ్డ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. గుర్తింపు పత్రాలను తమ వద్ద పెట్టుకుని వాహనాలను ఇస్తున్నారు పోలీసులు.
కాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓ వాహనదారు మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని పేర్కొంది. అతడి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read:ఫ్రెండ్ షిప్ డే విషాదం: హైదరాబాదులో యువతి ప్రాణం తీసిన డ్రంకెన్ డ్రైవ్
ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి తరఫున ఎవరూ రాకపోతే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని, తర్వాత వాహనాన్ని అప్పగించాలని వెల్లడించింది. అతడి వెంట మద్యం సేవించని వ్యక్తి ఉంటే అతడికి వాహనం ఇవ్వొచ్చని న్యాయస్థానం సూచించింది. అంతేకానీ, మద్యం మత్తులో డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ప్రాసిక్యూషన్ (prosecution) అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్ వేయాలని కోర్టు సూచించింది. అది పూర్తయ్యాక వాహనం అప్పగించాలని తెలిపింది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది.