
కామారెడ్డి జిల్లాలో (kamareddy district) ధాన్యం కుప్పపై పడి మరణించిన రైతు బీరయ్య మృతిపై వివాదం ముసురుకుంటోంది. బీరయ్యది సహజ మరణమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు జిల్లా కలెక్టర్. అయితే రైతు మరణాన్ని ప్రభుత్వం అవహేళన చేస్తుందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. కలెక్టర్లు ప్రభుత్వానికి బానిసలుగా మారారంటూ మండిపడుతున్నారు విపక్ష నేతలు. బీరయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) తెలిపారు. బీరయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రైతు బీరయ్య మృతి బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు బీరయ్య కుటుంబం స్పందిస్తూ ధాన్యం కోసమే 9 రోజులు అక్కడికక్కడే పడిగాపులు కాశాడని చెబుతున్నారు.
ALso Read:యాసంగిలో వరిని కొనేది లేదు.. మరోసారి కుండబద్ధలు కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి
కాగా.. కామారెడ్డి (kamareddy) జిల్లా లింగంపేట్ (lingam pet) వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల అకాల మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలాడు ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వీరయ్య. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు. వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు సెంటర్‌కు తీసుకొచ్చాడు రైతు. రోజూ వడ్ల కుప్ప దగ్గర కాపలా ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ సెంటర్ కు వచ్చి వడ్ల కుప్ప దగ్గరే నిద్రపోయాడు. ఉదయం రైతు వీరయ్య ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య.. కొనుగోలు సెంటర్‌కు వచ్చి చూసింది. అప్పటికీ వీరయ్య నిద్ర లేవలేదు. ఎంత లేపినా ఆయన మేల్కోలేదు.