బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీసుల సమీక్ష

By Siva KodatiFirst Published Jun 23, 2022, 8:24 PM IST
Highlights

జూలై 2, 3 వారాల్లో హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి నగర పోలీసులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననుండటంతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. 

జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై (bjp national executive meeting) గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నోవాటెల్‌లో రెండు రోజుల పాటు బీజేపీ సమావేశాలు జరగనున్నాయి. పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్‌ పోలీసులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాల్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న సమావేశాలకు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని బస , నోవాటెల్‌లో జరిగే సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో రూప్‌టాప్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 

కాగా.. తెలంగాణ (Telangana)పై బీజేపీ (Bjp) ఫోకస్ పెట్టింది.  దుబ్బాక (Dubbaka), హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది. 2024లో ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‎లో జులై 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda), కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర నాయకులు పాల్గొననున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక పంపుతున్నారు. 

మరోవైపు.. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా ఈనెల 30నే హైదరాబాద్ రానున్నారు. జులై 1న హెచ్ఐసీసీలో పార్టీ కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశంకానున్నారు.  జులై 2, 3న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. అనంతరం జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‎లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సమావేశాల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. 
 

click me!