మెడిసిన్ పరీక్ష పాస్ చేయిస్తానని నకిలీ బాబా బురిడీ: గచ్చిబౌలి పోలీసులకు యువతి ఫిర్యాదు

By narsimha lodeFirst Published Sep 6, 2021, 4:13 PM IST
Highlights

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పరీక్ష పాస్ చేయిస్తానని యువతిని మోసం చేసిన కేసులో నకిలీ బాబా విశ్వజిత్ ఝాపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన  యువతిని ఈ పరీక్ష పాస్ చేయిస్తానని నకిలీ బాబా నమ్మించి ఆమె వద్ద రూ.80 వేలు తీసుకొన్నాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయకుండా పోయాడు.

హైదరాబాద్:ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పాస్ చేయిస్తానని యువతిని మోసం చేసిన  నకిలీ బాబాపై హైద్రాబాద్ గచ్చిబౌలి పోలీసులు  కేసు నమోదు చేశారు.హైద్రాబాద్ కు చెందిన యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే ఫారిన్ వెళ్లేందుకు  ఫారిన్ మెడిసిన్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పరీక్ష పాస్ కావడానికి తెలిసినవారిని సంప్రదిస్తున్న సమయంలో ఫేస్ బుక్ ద్వారా నకిలీ బాబా  విశ్వజిత్ ఝా పరిచయమయ్యాడు.

తనకు ఉన్న అతీత శక్తుల ద్వారా ఆమెను  ఫారిన్  మెడిసిన్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయిస్తామని ఆ యువతిని నమ్మించాడు. ఇందుకు కాలభైరవ పూజ చేయడంతో పాటు ఇతర పూజలు చేయాలని చెప్పి ఆమె వద్ద నుండి విడతల వారీగా  రూ. 80 వేలు నగదును వసూలు చేశాడు.

గత ఏడాది నుండి ఈ ఏడాది జూన్ మాసం వరకు ఆమె  నకిలీ బాబా చెప్పిన ఖాతాలకు డబ్బులను జమ చేసింది. డబ్బులు జమ చేసిన తర్వాత విశ్వజిత్ ఝా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె తాను మోసపోయినట్టుగా గ్రహించింది. గచ్చిబౌలి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నకిలీ బాబా బ్యాంకు ఖాతాతో పాటు ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


 

click me!