సోమాజీగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లే రాజ్ భవన్ రోడ్డును మూసేసారు ట్రాఫిక్ పోలీసులు. మాజీ సీఎం కేసీఆర్ కోసం బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : హాస్పిటల్ సిబ్బంది, పోలీసులే కాదు చివరకు స్వయంగా కేసీఆర్ తనను చూసేందుకు రావద్దని బిఆర్ఎస్ శ్రేణులకు అభిమానులను విజ్ఞప్తి చేసారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ వద్దకే వస్తాను... ఇప్పుడు తనకోసం యశోద హాస్పిటల్ వద్దకు రావద్దని కేసీఆర్ సూచించారు. తాను ఇప్పుడిపపుడే కోటుకుంటున్నాను... బయటకు వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని అన్నారు. అంతేకాదు తనకోసం వచ్చేవారి వల్ల ఇతర పేషెంట్స్ కు ఇబ్బందికలిగే అవకాశం వుందికాబట్టి రావద్దని కేసీఆర్ కోరారు. అయినా యశోదా హాస్పిటల్ కు బిఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల తాకిడి తగ్గడంలేదు. దీంతో చేసేదేమీలేక ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోమాజీగూడ యశోద హాస్పిటల్ కు వెళ్లేదారినే మూసేసారు ట్రాఫిక్ పోలీసులు. ఖైరతాబాద్ తో పాటు పంజాగుట్ట వైపునుండి రాజ్ భవన్ రోడ్డులోకి ప్రవేశించే ప్రాంతాల్లో బారీకేడ్లు పెట్టారు. ఇలా కేసీఆర్ కోసం యశోదా హాస్పిటల్ వద్దకే వెళ్లేవారినే కాదు నిత్యం రాజ్ భవన్ మార్గంలో ప్రయాణించేవారిని అడ్డుకున్నారు. దీంతో ప్రత్యామ్నాయం లేక ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలోనే వాహనదారులు ప్రయాణించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువ కావడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను చూసేందుకు హాస్పిటల్ వద్దకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేసారు. అయినప్పటికీ సిద్దిపేట, గజ్వేల్ తో పాటు కేసీఆర్ స్వగ్రామం చింతమడక నుండి భారీగా మహిళలు యశోదా హాస్పిటల్ కు తరలివచ్చారు. వారిని హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఎదుటే కూర్చుని కేసీఆర్ మద్దతుగా నినాదాలు చేసారు. దీంతో మిగతా పేషెంట్స్, వారి సహయకులు ఇబ్బంది పడ్డారు.
Read More కేసీఆర్ విజ్ఞప్తి చేసినా వినడంలేదు... హాస్పిటల్ ముందు అభిమానుల ఆందోళన
యశోదా హాస్పిటల్ వద్ద కేసీఆర్ అభిమానుల ఆందోళనతో రాజ్ భవన్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై రాజ్ భవన్ మార్గాన్ని మూసివేసారు. చివరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ సిబ్బంది వివరించడంతో శాంతించిన మహిళలు ఆందోళనను విరమించారు. కేసీఆర్ ను చూడలేకపోయినా ఆయన ఆరోగ్యంగా వున్నాడన్న వార్త ఆనందం కలిగించిందని మహిళలు అన్నారు.