కాంగ్రెస్ (congress) ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ (Six guarantees)లను అచ్చంపేటలోని ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆ పథకాలకు అర్హులు కావాలంటే తన వద్ద ఉన్న భరోసా కార్డు తీసుకోవాలని ప్రచారం చేశాడు. ఒక్కో కార్డు నుంచి రూ.50 వసూలు చేశాడు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మెజారిటీ సీట్లు గెలవడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఆ గ్యారెంటీలను ఆసరాగా చేసుకొని మోసాలు మొదలయ్యాయి. ప్రజల అమాయకత్వాన్ని అలసుగా తీసుకొని కొందరు కేటుగాళ్లు చీటింగ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే ?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ గృహ నిర్మాణం, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత వంటిని అందులో ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ప్రభుత్వం ప్రారంభించింది. మిగితావి కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ ఆరు గ్యారెంటీలకు ఇంకా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయలేదు. కానీ అచ్చంపేట జిల్లా కేంద్రంలోని ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు ఈ గ్యారెంటీలను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొత్త మోసానికి తెరలేపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అర్హత పొందాలంటే ఈ పథకాలకు సంబంధించిన కార్డులు ఉండాలని ఓ ప్రచారం చేశాడు. ఆ కార్డుకు ‘భరోసా కార్డు’ అని కూడా పేరు పెట్టాడు.
దీంతో స్థానిక ప్రజలంతా అతడి దుకాణం వద్దకు క్యూ కట్టారు. అతడు ఒక్కో కార్డుకు ప్రజల దగ్గర నుంచి రూ.50 వసూలు చేశాడు. ఆ కార్డు లేకపోతే తమకు సంక్షేమ పథకాలు అందవేమో అన్న భయంతో చాలా మంది ఆ షాపు వద్దకు వెళ్లి బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.