నాగోలు మహదేవ్ జ్యుయలరీ కేసు: ప్రధాన నిందితుడు మహేంద్ర అరెస్ట్

By narsimha lode  |  First Published Dec 7, 2022, 10:27 AM IST

నాగోలు స్నేహపురి కాలనీలో గల మహదేవ్  జ్యుయలరీ దుకాణంలో బంగారం దోపీడీ కేసులో ప్రధాన నిందితుడు మహేంద్రను పోలీసులు ఇవాళ అరెస్ట్  చేశారు.



హైదరాబాద్:  నాగోలు స్నేహపురి కాలనీలో మహదేవ్ జ్యుయలరీ దుకాణంలో  బంగారం దోపీడీ కేసులో ప్రధాన నిందితుడు మహేంద్రను పోలీసులు బుధవారంనాడు అరెస్ట్  చేశారు.డిసెంబర్ 1వ తేదీన  రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దుండగులు జ్యుయలరీ షాపులోకి వచ్చారు. కాల్పులకు దిగి  కిలోన్నర బంగారం, రూ. 1.70 లక్షల నగదును దోపీడీ చేశారు.  ఈ దోపీడీకి కీలక సూత్రధారి  మహేంద్రను ఇవాళ  పోలీసులు అరెస్ట్  చేశారు.

నెలన్నర క్రితమే మహదేవ్ జ్యుయలరీ దుకాణంలో దోపీడీకి నిందితులు  రెక్కీ నిర్వహించారని  పోలీసులు గుర్తించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ కు చెందిన మహేంద్ర  రాజస్థాన్ కు చెందిన ఇద్దరితో కలిసి దోపీడీకి పాల్పడ్డాడు. నిందితులు బంగారం దోపీడీ చేసే సమయంలో  ఉపయోగించిన బైక్ కూడా  చోరీకి గురైందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.దోపీడీ తర్వాత మహేంద్ర గజ్వేల్ లోని తన నివాసంలో బంగారాన్ని దాచిపెట్టాడు.నిందితుడికి అతని భార్య  కూడా సహకరించింది. మరో వైపు మహేంద్రకు అతని స్నేహితుడు ఒక వాహనాన్ని కూడా సమకూర్చినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్  చేసినట్టుగా రాచకొండ పోలీసులు ప్రకటించారు. 

Latest Videos

undefined

సికింద్రాబాద్ కు చెందిన బంగారం హోల్ సేల్ వ్యాపారి  సుఖ్ రామ్, రాజ్ కుమార్ లు  పట్టణంలోని పలు బంగారం దుకాణాలకు బంగారం సరఫరా చేస్తూ  మహదేవ్ జ్యుయలరీ దుకాణానికి వచ్చారు.  సుఖ్ రామ్ మహదేవ్ జ్యుయలరీ దుకాణానికి రాగానే  దుండగులు  షాపులోకి వెళ్లి  బంగారం ఇవ్వాలని  డిమాండ్  చేశారు.   అయితే  దుండగులను దుకాణ యజమాని కళ్యాణ్ సింగ్ సహా  మరికొందరు  ప్రతిఘటించారు.ఈ సమయంలో  దుండగులు తమ వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సుఖ్ రామ్ వద్ద ఉన్న బంగారం బ్యాగును  దుండగులు తీసుకొని పారిపోయారు.అయితే నిందితులను పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నించారు.కానీ వారు దొరకలేదు. నిందితులు బైక్ పై వెళ్లిన ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ లైవ్ ట్రాకింగ్  ద్వారా  ఒకరిని గుర్తించారు పోలీసులు. అతని ద్వారా మహారాష్ట్రలో తలదాచుకున్న మరో నలుగురిని కూడా పోలీసులు ఈ నెల 4వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఈ కేసులో ప్రధాన సూత్రధారి  మహేంద్రను పోలీసులు అరెస్ట్  చేశారు. 

also read:నాగోలు మహదేవ్ జ్యుయలరీ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

దుండగుల కాల్పుల్లో గాయపడిన  ఇద్దరు నాగోలులోని  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దోపీడీ గురించి  బాధితుల నుండి పోలీసులు సేకరించిన సమాచారంతో పాటు సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.  సుమారు 15 పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోపీడీ జరిగిన వారం రోజుల్లో ఈ ఘటనలో పాల్గొన్న  వారిని పోలీసులు అరెస్ట్  చేశారు.  


 

click me!